Skip to main content

Posts

Showing posts from 2009

యక్ష ప్రశ్నలు

ఈ టపా టైటిలు ఊరికే పెట్టలేదు. కాబట్టి ఒక చిన్న ప్రశ్న. గాల్లోంచి సృష్టించే ప్రక్రియ నిర్వహించడానికి అతి ఉత్తమమైన కాంబినేషన్ ఏది ? 1. బాబాలు,విబూది 2. రాజకీయ నాయకులు,ఆత్మగౌరవం 3. సైంటిస్టులు,ఆక్సిజనుకి ప్రత్యామ్నాయం 4. నేను,థియరీ * ( * లేటుగా ఒచ్చినా లేటెస్టుగా ఒచ్చేదే...) ముందే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది కాబట్టి మీరేమి సమాధానం చెప్పినా 4 కింద పరిగణించి తరువాతి పారాకు పాసు చేయడమయినది. ప్రశ్నలు చాలా రకాలు. వాటిలో ముఖ్యమైనవి రెండు - సమాధానం చెప్పదగ్గవి, అడిగేవాళ్ళ ఉద్దేశం/స్వభావం తెలియకుండా సమాధానం చెప్పకూడనివి. "ప్రమోషను కావాలా ?" "నీకు లడ్డూ ఇష్టమా ?" "సినిమాకి ఒస్తావా ?" ఇలాంటివి మొదటి రకం అన్నమాట. ఇక రెండో రకానికి ఒద్దాం - "ఖాళీగా ఉన్నావా ?" "ఒక జోకు చెప్పమంటావా ?" "తెలంగాణా ఒచ్చినట్టేనా ?" ఇలాంటివి, అడిగే వాళ్ళ స్వభావం తెలియకుండా సమాధానం చెప్తే తరవాత జరిగే పరిణామాలకి మీరే బాధ్యులన్నమాట. ఇంకో రకం ప్రశ్నలు ఉన్నాయి. ఇవి ఎన్ని సార్లు ఎదురయినా సమాధానం చెప్పకూడదు. అడిగేవాడు చొక్కా పట్టుకుని కొట్టేంత వరకూ

ఎడ్డెం - తెడ్డెం - అడ్డం

గమనిక - ఈ కింద రాసిన అబద్ధాలు ఒక దానికోటి సంబంధం ఉండకపోవచ్చు, ఈ వాక్యంతో సహా. అదొక జన సంచారం లేని అడివి. చుట్టూ చూడకుండా, తల తిప్పకుండా, ధైర్యంగా నేను అందులో పడి నడుస్తున్నాను. కొంత దూరం వెళ్ళగానే ఒక బోర్డు కనిపించింది, దారిని రెండు పాయలుగా చీలుస్తూ. రూట్-1, రూట్-2 అని రాసుంది. అది చూడగానే కొపం ఒచ్చి, ఆ బోర్డు ఊడబీకి, అక్కడున్న రాయి మీద కాసేపు కూర్చుని మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ పోయాను. ఉన్నట్టుండి మెలకువ ఒచ్చింది. బద్ధకంగా టివీ ఆన్ చేసాను. బాబా రాందేవ్ గారు ఏవో భంగిమలు ప్రదర్శిస్తున్నారు. చుట్టూ జనాలంతా అలాగే చేద్దాం అని ప్రయత్నిస్తున్నారు. లోకంలో హిట్లరూ, సద్దాం హుస్సేనూ లాంటి వాళ్ళు ఉండేవారంటే ఆశ్చర్యమేముంది? ఇంత మంది పొద్దుటే నిద్ర మానుకుని చిత్రహింసలు పడడానికి రెడీగా ఉంటే ! తయారవుతూ ఆలోచిస్తున్నాను. అయినా మనుషులు రకరకాలు. 'ముల్లుని ముల్లుతోటే తియ్యాలి ' అని వంట బట్టించుకున్న వాళ్ళు ఉంటారు, అంటే మాములు మనుషులన్న మాట. ముల్లుని గడ్డపారతోనో, ఇంకా పెద్ద దాంతోనో తియ్యబోయే వాళ్ళని కూడా చూసాను - ఉదాహరణకి చారిగాడు. ఒక రోజు ఒచ్చి, సీరియస్ గా "రేయ్, నాకు బాగా తలనెప్ప

అదిగో పులి - 3

యమదేవుడు వేరే పన్లో బిజీగా ఉన్నాడో ఏమో, ఏ అనర్ధం జరక్కుండా బస్సు బెంగుళూరులో ఆగింది. దిగగానే అందరూ ఆకలి మీద ఉండడంతో హోటలు వెతుక్కుంటూ వెళ్ళాము. హోటలు కనిపించగానే నీలమేఘం గట్టిగా నవ్వడం మొదలెట్టాడు. ఏంటన్నట్టు అందరం ఆయిన వైపు చూసాం. "ఈ బెంగుళూరు వాళ్ళకీ....", పొట్ట పట్టుకుని ఇంక నా వల్ల కాదన్నట్టు చెయ్యూపుతున్నాడు. "ఏంటి ?" అడిగాను. "వీళ్ళకేంటో అన్నీ డౌట్లేనయ్యా.. చూడు.. ' హోటలో బృందావనో ' అని రాసుకున్నారు. ఏంటో తెలీనప్పుడు ఎందుకు పెట్టినట్టో ! వెర్రి వెంగళప్పలు. " అన్నాడు గట్టిగా. పర్లేదే, ఓవరాక్షను పక్కన పెడితే వీడిలోనూ కొంచెం సెన్సాఫ్ హ్యూమరున్నట్టుంది! ఇంతలో "What can I do for you ?" ఒక గొంతు వినపడింది. ఎవడో జీన్సు పాంటు మీద ఫార్మల్ షర్టు, టై కట్టుకుని నిలబడ్డాడు. సన్నగా గడ్డం పెంచుకుని చల్లద్దాలు పెట్టుకుని ఉన్నాడు. ఇంకా పరీక్షగా చూసాను. సోడాబుడ్డి కూలింగ్లాసెస్ ! అదే చూడ్డం ! "ఐ యాం వెంగళప్పా - The Cool Geek" అన్నాడు. అదేదో సినిమాలో ఎవడో కధ రాస్తే అందులో కారెక్టర్లు ఎదురుగుండా ప్రత్యక్షమయినట్టు, ఎవరెవరో దాపురి

అదిగో పులి - 2

"గతిలేని గుంపుకి మతిలేని నాయకుడు" అన్నారు. ఎవరన్నారో అడక్కండి. ఎవరినన్నారో అస్సలు అడక్కండి. జార్జి పుష్షో, కళ్ళగుంట్ల చండభీకర రావుగారో అని మాత్రం అపార్ధం చేసుకోకండి. ఎందుకంటే ఇక్కడి హీరో వేరే ! మళయాళ దేశానికి మనశ్శాంతి కోసం పారిపోదామనుకున్న మా అందరి బాగోగుల్ని నాగబాబుగాడు తలకెత్తుకున్నాడు. ఆ బరువుకి తల దిమ్మెక్కిందేమో తిన్నగా పోవల్సిన చోటుకి పోకుండా బెంగుళూరు మీంచి రూటు ప్లాన్ చేశాడు. "మధ్యలో బెంగుళూరు ఎందుకురా, ఇదివరకే చూసాం కద" అని గొణిగాను. "మీకందరికీ నా కళ్ళతో చూపిస్తాన"న్నాడు వాడు. నాకు సన్నగా వణుకు మొదలయ్యింది. వీడి నోట్లోంచి అలాంటి పవర్ ఫుల్ డయిలాగులు ఒచ్చినప్పుడల్లా ఏదో ఒక అనర్ధం జరిగి తీరుతుంది ! ఒక పక్క గుబులుగా ఉన్నా ఏదైతే అదయిందిలే అని మళయాళ దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాను. మాతోపాటూ విశాల్, విజయ్, బీరేష్(వాడి భాషలో) బెంగుళూరు బస్సెక్కారు. అందరూ మంచి వేడి మీద ఉన్నట్టున్నారు. బస్సు స్టార్టవుతూనే జేబులోంచి పేపర్లు బయిటకి తీసారు. చూడగానే గుర్తు పట్టేశాను. ఉద్యోగ పురాణం అసహన పర్వంలోని బాసాసుర తిట్ల దండకం కాపీలు అవి. డ్రైవరుకు ఆకలేసి దాబా దగ

అదిగో పులి - 1

ఆ రోజు పొద్దుటే చిన్న తలనెప్పితో నిద్ర లేచాను. ఆఫీసు గుర్తు రాగానే పరిస్థితి చెయ్యి దాటి పోయింది. ఛీ, ఇంతేనా జీవితం అనిపించింది. పోనీ ఎగ్గొట్టేద్దామా, మా బాసుగాడి ఫ్రెంచి గడ్డం సాక్షిగా క్రితం రోజు మీటింగు రూములో ఎక్సెల్ షీట్లు మార్చుకుని చేసుకున్న బాసలు గుర్తొచ్చాయి. చేసుకున్నవాడికి చేసుకున్నంత అని ఇందుకే అన్నారు కాబోలు. నేను గానీ కనిపించకపోతే ఆ విరహ వేదనలో వాడో సైకో కిల్లర్ అయ్యి మా ఇల్లు వెతుక్కుంటూ ఒస్తాడేమో అని భయమేసి తయారవడం మొదలెట్టాను. ఇంకేమైనా మార్గాలు దొరుకుతాయేమో అని అలొచించినా ఏమీ తట్టకపోవడంతో సౌరవ్ గంగూలీ బాటింగుకి బయలుదేరినట్టు ఆఫీసుకి బయలుదేరాను. బస్సెక్కి కూచోగానే ఇంటికి ఫోన్ చేసాను. మా అమ్మ ఎత్తింది. బావున్నావా, బాగా తింటున్నావా, రోజు స్నానం చేస్తున్నావా, పప్పులో పోపెయ్యడం ఇప్పటికయినా ఒచ్చిందా లాంటి కబుర్లన్నీ అయిపోయాక, "అమ్మా, ఏంటో బొత్తిగా ఇంటరెస్టు ఉండట్లేదే దేని మీదా, అసలు మనసు మనసులో లేదు" అన్నాను. "తొందరగా పెళ్ళి చేసుకోరా, లేకపోతే ఆ అమ్మాయెవరో చెప్పు , మీ నాన్నా నేనూ వెళ్ళి వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడతాం". "నాకే టయిములేక ఏడుస్తుంట

నేను, దేవుడు, మా నాన్న - 2

మర్నాడు ఆదివారం కావడంతో మా పిల్లకాయల పార్టీ సర్వ సభ్య సమవేశం మొదలైంది. పక్కింట్లో ఉండే బుజ్జి గాడూ, వాళ్ళ తమ్ముడు పండు గాడు, వాళ్ళ పక్కింట్లో ఉండే శీనుగాడూ, వాళ్ళ చెల్లి కవిత హాజరయ్యారు. అధ్యక్షత వహిస్తున్న మా చెల్లి డయిలాగులేవీ లేకుండా "ఓ పియా పియా.. ఓ పియా పియా " అంటూ ఇళయరాజా పాటని ప్రళయ రాగంలో విలయ తాండవం చేయించింది. అయిదు నిమిషాలయినా పాట ముందుకి కదలకపోవడంతో అందరూ వెళ్ళిపోక ముందే దాన్ని కూర్చోబెట్టి నేను మొదలెట్టాను. "జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట.. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ అనాథలైనా అభాగ్యులైనా అంతా నా వాళ్ళూ ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరూ" అంటూ వేలు చూపిస్తూ గుండ్రంగా తిరుగుతూ...ఆపేసాను - వీధి చివర చారిగాడు కనిపించాడు. మామూలుగా పరిగెట్టడం మానేసి గుర్రం ఎక్కి ఒస్తున్నట్టు గెంతుకుంటూ ఒస్తున్నాడు వాడు. ఒస్తూనే పక్కకి లాక్కెళ్ళి, "ఒరేయ్, మా నాన్న జేబులో యాభై రూపాయిలు దొరికాయి రా, మనం ఫైవ్ స్టార్ చాక్కెట్ట్లు కొనుక్కుందాం పద" అన్నాడు. అసలు వీడు గుండెలు తీసిన బంటు కాకపోయినా కనీసం గుండు చేసి ఒదిలిపెట్టే బంటు అని అప్పటికే నాకు అను

నేను, దేవుడు, మా నాన్న - 1

ఆ రోజు స్కూల్లో ఘోర పరాభవం జరిగింది.అసలు రోజూ స్కూల్ కి ఎందుకు వెళ్ళాలో అర్ధం గాక ఏడుస్తూ వెళ్తుంటే ఈ అవమానాలోటీ - బాలయ్య సినిమానే చూడలేక చూస్తుంటే, మధ్యలో విజయ్ కాంత్ డబ్బింగ్ సినిమా ట్రైలర్ వేసినట్టు ! సరే, అసలేం జరిగిందో చెబుతాను. ఆ రొజు పొద్దుటే స్కూల్లో ప్రెయెర్ జరుగుతోంది. రెండో క్లాసు వాళ్ళం కావడంతో తగిన గౌరవం ఇచ్చి ముందు నించోబెట్టారు. ఎదురుగా మా హెడ్మాష్టరు నించున్నాడు. వాడి పేరు వలవన్. పెద్ద పెద్ద మీసాలేసుకుని ఒక లోటాడు టీ తాగుతూ తిరిగే వాడంటే మాకు హడల్. మా టీచరుకి అంతకంటే హడల్ అని నా నమ్మకం. ఎందుకంటే క్లాసు రూము పక్క నించి వాడు వెళ్ళినప్పుడల్లా మా అందరికంటే ముందు మా టీచరు నోటి మీద వేలేసుకునేది. అది చూసి మేము కూడా వేసుకునేవాళ్ళం. అసలు వాడి లాంటి వాళ్ళని స్కూల్లో ఉంటే వలవన్ అంటారనీ, బైటకొచ్చి దేశం మీద పడితే వీరప్పన్ అంటారనీ తరవాత తరవాత, కొంచెం లోక ఙానం ఒచ్చాక తెలిసింది. ఇదివరకెపుడో కుదురు లేని దూడ పిల్ల పులి ముందుకెళ్ళి డాన్స్ చేసిందిట! నా వెనక నించున్న నాగబాబు గాడికి ఉన్నట్టుండి ఎక్కడలేని చిలిపితనం ముంచుకొచ్చి నిక్కర్లో నీట్ గా టక్ చేసి ఉన్న నా చొక్కాని సాంతం బైటకి లాగా

చారిగాడు

పెరుగు కోసం వెళ్ళిన చారిగాడు పెద్ద చప్పుడు చేస్తూ చెప్పులొదిలేసి తలుపు కూడా వెయ్యకుండా లోపలికొచ్చాడు. దాంతో నేను నా గతంలోంచి బైటికొచ్చాను. ఒచ్చిన వాడు కాస్తా చేతిలో కవరు పక్కన పారేసి కనీసం డప్పు మ్యూజిక్కైనా లేకుండా డాన్సెయ్యడం మొదలు పెట్టాడు. ఈ సందడి విని నాగబాబు పప్పుని దాని ఖర్మానికి ఒదిలేసి అక్కడికొచ్చి నించున్నాడు. "ఏమయింది రోయ్" అడిగాను. "ఒరేయ్, ఎదురింట్లో ఉంటుందే స్వాతి, ఆ పిల్ల నన్ను చూసి నవ్వింది రా. కాదు కాదు మూడు రోజుల నించి నవ్వుతోంది రా !" అన్నాడు వాడు. "గట్టిగా నవ్విందా, చిన్నగా నవ్విందా ?" "అదేం ప్రశ్నరా ? అందంగా, సినిమా హీరోయిన్లా నవ్వింది. ఇంక నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే" అంటూ డాన్స్ కంటిన్యూ చేశాడు వాడు. అది వినగానే నాగబాబుగాడు నవ్వడం మొదలెట్టాడు. వేస్తున్న డాన్స్ అలాగే ఆపేసి ఏవిటన్నట్టు వాడి వైపు చూసాడు చారిగాడు. "ఒరేయ్, వీడికి చిన్నప్పుడే చెప్పాను, నిన్ను చూస్తే కుక్కలు కూడా నవ్వుతాయిరా అని, వినిపించుకోలేదు వీడు" నవ్వాపకుండా నా వైపు తిరిగి చెప్పాడు నాగబాబుగాడు. చారిగాడు కోపంతో ఊగిపోడం మొదలెట్టాడు. ఇంకాస

బోయినం

ఆ రోజు అప్రయత్నంగా వంట డ్యూటీ నాగబాబుకి ఇచ్చేసి డిక్షనరీ పక్కన పెట్టుకుని హిందూ పేపర్ చదువుకుంటున్నాను. "ఒరేయ్, పప్పులో ఉప్పెంత వెయ్యాలి ?" అడిగాడు నాగబాబు. "ఒక చారెడు వెయ్ " తల తిప్పకుండా సమధానం చెప్పా. "మరి చారేమో గిన్నెడు ఉంది కదరా ?" ఈ సారి తలెత్తి చూడకుండా ఉండలేకపోయాను. వంటింటి గుమ్మంలో బనీనుతో కుడి చేతిలో గరిట పట్టుకుని ఎడం చెయ్యి నడుం మీద వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్నాడు వాడు. "ఒరేయ్ బడుద్ధాయ్, నీకు తెలుగొచ్చా అసలు ?" అరిచాను. " ఓహో అర్ధం అయింది లే, అరుస్తావెందుకు ? చారిగాడు పెరుగు తెస్తానని బైటకి వెళ్ళాడు ఇప్పుడే. వాడొచ్చే దాకా ఆగాలంటే కష్టం" అన్నాడు నాగబాబు. ఈ రోజు హిందూ పేపరు అనవసరంగా కొన్నట్టున్నాను. "ఒరేయ్ సన్నాసీ, చారెడు అంటే ఇంత" అన్నాను అరచేతిలో నాలుగువేళ్ళ మీద బొటనవేలు మడిచి చూపిస్తూ, "అయినా నీకు తెలుగూ రాదు, వంటా రాదు; ఇలా ఐతే ఎదో ఒక టీవీ ఛానల్లో వంటల ప్రోగ్రాంలో యాంకర్ కింద సెటిల్ అవ్వాల్సొస్తుంది జాగ్రత్త !" శపించా. వాడు పగలబడి నవ్వి లోపలికెళిపోయాడు, పొగిడాననుకున్నాడో ఏమో! అ

ఎందుకంటే..

అల్రెడీ ఉన్న బ్లాగులో భారమైన విషయాలే ఉండడం వల్ల, ఏదైనా సరదాగా రాద్దామని ఈ బ్లాగు మొదలు పెడుతున్నాను.