పెరుగు కోసం వెళ్ళిన చారిగాడు పెద్ద చప్పుడు చేస్తూ చెప్పులొదిలేసి తలుపు కూడా వెయ్యకుండా లోపలికొచ్చాడు. దాంతో నేను నా గతంలోంచి బైటికొచ్చాను. ఒచ్చిన వాడు కాస్తా చేతిలో కవరు పక్కన పారేసి కనీసం డప్పు మ్యూజిక్కైనా లేకుండా డాన్సెయ్యడం మొదలు పెట్టాడు. ఈ సందడి విని నాగబాబు పప్పుని దాని ఖర్మానికి ఒదిలేసి అక్కడికొచ్చి నించున్నాడు. "ఏమయింది రోయ్" అడిగాను. "ఒరేయ్, ఎదురింట్లో ఉంటుందే స్వాతి, ఆ పిల్ల నన్ను చూసి నవ్వింది రా. కాదు కాదు మూడు రోజుల నించి నవ్వుతోంది రా !" అన్నాడు వాడు. "గట్టిగా నవ్విందా, చిన్నగా నవ్విందా ?" "అదేం ప్రశ్నరా ? అందంగా, సినిమా హీరోయిన్లా నవ్వింది. ఇంక నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే" అంటూ డాన్స్ కంటిన్యూ చేశాడు వాడు. అది వినగానే నాగబాబుగాడు నవ్వడం మొదలెట్టాడు. వేస్తున్న డాన్స్ అలాగే ఆపేసి ఏవిటన్నట్టు వాడి వైపు చూసాడు చారిగాడు. "ఒరేయ్, వీడికి చిన్నప్పుడే చెప్పాను, నిన్ను చూస్తే కుక్కలు కూడా నవ్వుతాయిరా అని, వినిపించుకోలేదు వీడు" నవ్వాపకుండా నా వైపు తిరిగి చెప్పాడు నాగబాబుగాడు. చారిగాడు కోపంతో ఊగిపోడం మొదలెట్టాడు. ఇంకాస...