Skip to main content

నేను, దేవుడు, మా నాన్న - 2

మర్నాడు ఆదివారం కావడంతో మా పిల్లకాయల పార్టీ సర్వ సభ్య సమవేశం మొదలైంది. పక్కింట్లో ఉండే బుజ్జి గాడూ, వాళ్ళ తమ్ముడు పండు గాడు, వాళ్ళ పక్కింట్లో ఉండే శీనుగాడూ, వాళ్ళ చెల్లి కవిత హాజరయ్యారు. అధ్యక్షత వహిస్తున్న మా చెల్లి డయిలాగులేవీ లేకుండా "ఓ పియా పియా.. ఓ పియా పియా " అంటూ ఇళయరాజా పాటని ప్రళయ రాగంలో విలయ తాండవం చేయించింది.

అయిదు నిమిషాలయినా పాట ముందుకి కదలకపోవడంతో అందరూ వెళ్ళిపోక ముందే దాన్ని కూర్చోబెట్టి నేను మొదలెట్టాను.

"జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట..
నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ
అనాథలైనా అభాగ్యులైనా అంతా నా వాళ్ళూ
ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరూ"
అంటూ వేలు చూపిస్తూ గుండ్రంగా తిరుగుతూ...ఆపేసాను - వీధి చివర చారిగాడు కనిపించాడు. మామూలుగా పరిగెట్టడం మానేసి గుర్రం ఎక్కి ఒస్తున్నట్టు గెంతుకుంటూ ఒస్తున్నాడు వాడు.

ఒస్తూనే పక్కకి లాక్కెళ్ళి, "ఒరేయ్, మా నాన్న జేబులో యాభై రూపాయిలు దొరికాయి రా, మనం ఫైవ్ స్టార్ చాక్కెట్ట్లు కొనుక్కుందాం పద" అన్నాడు. అసలు వీడు గుండెలు తీసిన బంటు కాకపోయినా కనీసం గుండు చేసి ఒదిలిపెట్టే బంటు అని అప్పటికే నాకు అనుమానం. అది చాలక ఇలా నమ్మశక్యం కాని సంగతులన్నీ చెప్తుంటాడు. నేను ఎంత వెతికినా, ఎన్ని సార్లు వెతికినా మా నాన్న జేబులో రూపాయికి మించి దొరకలేదు ఎప్పూడూ. ఆ దొరికింది మాత్రం పక్కింట్లో, ఆ ఇంటి వాళ్ళకైనా తెలియకుండా దాచినా మా చెల్లికి దొరికేస్తుంది. దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే వీడికి యాభై రూపాయిలు దొరికాయంటే కచ్చితంగా ఎదో వెధవ పని చేసుంటాడనిపించింది.

ఇన్ని ఆలోచించి కూడా, ఫైవ్ స్టార్ మీద ప్రేమతో చారిగాడితో బయలుదేరాను.

నాగబాబు గాణ్ణి కూడా తీసుకెళ్దాం అని వాళ్ళింటికి వెళ్ళాము.ముందు రోజు నేనిచ్చిన షాక్ కి జ్వరం తెచ్చుకున్నాడు వాడు.చేసేదేం లేక వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్దాం అని చారి గాడింటికి బయలుదేరాము.

"ఆగాగు నేనో షార్ట్ కట్ కనిపెట్టాను మా ఇంటి నించి మీ ఇంటికి" అన్నాడు చారిగాడు .

మా ఎదురింటి గోడ దూకి అక్కడ్నించి వాళ్ళ పక్కింట్లోకి దూకీ, వాళ్ళ వెనకింట్లోకి దూకీ రోడ్డు దాటి మళ్ళీ ఇంకో రెండిళ్ళు అలా దూకాక, చారిగాడు వాళ్ళ ఇంటి పెరట్లొ పడ్డాము. ఆ అలికిడికి వాళ్ళ అమ్మ ఒచ్చింది. మా కాళ్ళ కింద విరిగిపోయి నలిగిపోతున్న గులాబి మొక్కల్ని చూసి వీపు మీద ఒక బొబ్బట్టు,నెత్తిన రెండు లడ్లూ వడ్డించి నాలుగు అక్షింతలేసింది.

దొడ్డి దార్లోంచి తీస్కొచ్చింది చాలక, ఇంత అవమానం చేయించినందుకు నేను చారిగాడి వైపు కోపంగా చూసాను. వాడు ఇంకా కోపంగా గుమ్మం వైపు చూస్తున్నాడు. తలుపు చాటున వాళ్ళన్నయ్య గిరి తెగ నవ్వుతున్నాడు.
అప్పటికి కంటి చూపుతోనో, కంటి సైగతోనో, షర్టు దులపడంతోనో, గుండీ నలపడంతోనో చంపేసే టెక్నాలజీ అందుబాటులో లేకపోడం వల్ల తిరిగి ఒకళ్ళ మోహం ఒకళ్ళం చూసుకున్నాం నేనూ, చారిగాడు. తరవాత తేరుకుని, ఇప్పుడు గొడవలకంటే పని ముఖ్యం అని ఒకళ్ళకొకళ్ళం సర్ది చెప్పుకుని, వాళ్ళమ్మకి ఏదోటి చెప్పి బయిట పడ్డాం. వాళ్ళ వీధి చివర శీను కొట్లో చాక్కెట్ట్లు కొనుక్కుని నడుచుకుంటు పోయాము. తరవాత ఎం చెయ్యాలో తోచక నరసింహ స్వామి గుట్ట మీదకెళ్ళి కనబడిన ప్రతీ రాయీ అక్కడ కోనేట్లోకి విసిరేసి సాయింత్రానికి ఇళ్ళు చేరుకున్నాం.

సాయంత్రం ఇంటికెళ్ళగానే ఏదో తేడాగా అనిపించింది. బుజ్జిగాడు ఏదో సైగ చేసాడు.పట్టించుకోకుండా లోపలికెళ్ళాను.
మా చెల్లి అప్పుడే నిద్ర నటిస్తోంది.

"ఏరా గుడికొస్తావురా ?" అని బామ్మ అడగ్గానే మా నాన్న "వాడికి హోంవర్క్ ఉంది, రాడు" అని చెప్పాడు. మనసు కీడు శంకించింది. మా బామ్మ బయిటకి వెళ్తూనే తలుపేశాడు.

బెల్టు బయిటకు తీస్తున్నాడు. కిటికీలోంచి దూరి పారిపోదాం అనుకుంటే ఒక కాలూ,ఒక చెయ్యీ మాత్రమే పట్టింది, కుదరలేదు.

అసలు టౌన్లో పెరగబట్టి పల్లెటుళ్ళలో దసరా పండుగ ఎలా ఉంటుందో తెలియలేదు గానీ, తరవాత ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూస్తే అర్ధం అయింది. చిన్నప్పుడు మా నాన్నకి కోపమొచ్చినప్పుడల్లా మా ఇంట్లో దసరా పండగే - పూనకాలు, పులి వేషాలు,కొరడాలు,దరువులు ...ఒకటేంటి !

"రారా.. ఇటు రా.. నువ్వు ముందు ఇటు రా..", మా నాన్న బెల్టు ఊపుతున్నాడు.
పూర్తిగా దొరికిపోయాననుకునే టైంకి ఒక అయిడియా తళుక్కున మెరిసింది.

ఆగమన్నట్టు సైగ చేసి అక్కడే ఉన్న దేవుడి పటం చూపించి "అదెవరో తెలుసా ?" అడిగాను.
"నేనే..ఈ పూటకి అన్ని దేవుళ్ళూ, దయ్యాలూ నేనే" అన్నాడు మా నాన్న.
"నిన్నటి నీ నిర్వాకం నాగబాబు వాళ్ళ నాన్న మార్కెట్లో కనిపించి చెప్పాడు. నీకీ మధ్య బొత్తిగా భయం లేకుండా పోయింది. అది చాలక ఎవరితో చెప్పకుండా గుట్ట మీదకెళతావా ?" అని బెల్టు ఎత్తాడు.

భయంతో బిక్క చచ్చిపోయాను. దెబ్బలు పడ్డాయో లేదో గుర్తులేదు గానీ రెండు లీటర్ల నీళ్ళు మాత్రం ఒచ్చాయి కళ్ళలోంచి. నా ఏడుపు విని మా అమ్మ పక్కింట్లోంచి పరుగులు పెడుతూ ఒచ్చి నన్ను వంటింట్లోకి లాక్కు పోయింది. వంటింటి అరుగు మీద కూచోబెట్టి బియ్యప్పిండి అట్లేసి పెట్టింది.

అప్పుడనిపించింది దేవుడి సంగతి దేవుడెరుగు, అమ్మ పక్కనుంటే చాల్లే అని !

Comments

This comment has been removed by the author.
కుమ్మేసావ్ బాబాయ్
Anonymous said…
Excellent sir..... racha racha chesaaru...


rajkumar
enti meeru baboi intha senceofhumour inni rojulu ela kadupulo dachukunnaru ippatikaina malanti vallaki panchuthunnaduku thanks asalu aa shily meeku ela alavadinda ani ashcharyanga vundi
మీ కరకరలు మాతో పొర్లు దండాలు పెట్టిస్తున్నాయి సోదరా! (ROFL అని కవి హృదయం). ఇలాగే ముందుకు పోవాలని మనవి చేసుకుంటున్నాను. జై నాగబాబు, జై వేమన గారు :)
sunita said…
చాలా సరదాగా ఉందీ పోస్ట్.చదివినంత సేపూ నవ్వుకుంటూనే ఉన్నాను.
శ్రీ said…
మీ బ్లాగులు బాగున్నై .. మీ స్వగతం బ్లాగ్ ఫోటో బాగుంది .. మీరే తీశారా ? చాలా బాగుంది ...
Sravya V said…
ఇప్పటికి ఒక పది సార్లు చదివాను ఐనా నవ్వు ఆగటంలేదు !
చాలా చాలా బాగా రాసారు.. చదువుతున్నంతసేపూ ఒకటేనవ్వు ..ప్లీజ్ కీపిటప్ :)
వేమన said…
కమెంటిన అందరికీ నెనర్లు !

@ శ్రీ గారూ - స్వగతం బ్లాగులో ఫొటో మేము
తీసిందేనండీ..కాలిఫొర్నియాలో.
నాకూ మా ఫ్రెండుకీ ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు ఎవరు తీసారనేదాని మీద :)
చూసారా ఎంతైనా అమ్మ అమ్మే!! ఒక అమ్మ వీపు మీద బొబ్బట్లేస్తే మరొక అమ్మ పెనం మీద బియ్యప్పిండి అట్లూను. నాన్నల వేషాలు తెలిసాయి కదా, విన్నారా వేమన?

చాలా బాగుంది. :)
కరకరలాడుతూ బావున్నాయి మీ కరకరలు!
సూపర్ చాలా బావున్నాయి మీ కబుర్లు..
Manohar Dubbaka said…
This comment has been removed by the author.
Raghu said…
emi anni..report lu, BDC le anukunna..ilantivi kuda rastava..racha kada :) super..bavundi

Popular posts from this blog

నేను, దేవుడు, మా నాన్న - 1

ఆ రోజు స్కూల్లో ఘోర పరాభవం జరిగింది.అసలు రోజూ స్కూల్ కి ఎందుకు వెళ్ళాలో అర్ధం గాక ఏడుస్తూ వెళ్తుంటే ఈ అవమానాలోటీ - బాలయ్య సినిమానే చూడలేక చూస్తుంటే, మధ్యలో విజయ్ కాంత్ డబ్బింగ్ సినిమా ట్రైలర్ వేసినట్టు ! సరే, అసలేం జరిగిందో చెబుతాను. ఆ రొజు పొద్దుటే స్కూల్లో ప్రెయెర్ జరుగుతోంది. రెండో క్లాసు వాళ్ళం కావడంతో తగిన గౌరవం ఇచ్చి ముందు నించోబెట్టారు. ఎదురుగా మా హెడ్మాష్టరు నించున్నాడు. వాడి పేరు వలవన్. పెద్ద పెద్ద మీసాలేసుకుని ఒక లోటాడు టీ తాగుతూ తిరిగే వాడంటే మాకు హడల్. మా టీచరుకి అంతకంటే హడల్ అని నా నమ్మకం. ఎందుకంటే క్లాసు రూము పక్క నించి వాడు వెళ్ళినప్పుడల్లా మా అందరికంటే ముందు మా టీచరు నోటి మీద వేలేసుకునేది. అది చూసి మేము కూడా వేసుకునేవాళ్ళం. అసలు వాడి లాంటి వాళ్ళని స్కూల్లో ఉంటే వలవన్ అంటారనీ, బైటకొచ్చి దేశం మీద పడితే వీరప్పన్ అంటారనీ తరవాత తరవాత, కొంచెం లోక ఙానం ఒచ్చాక తెలిసింది. ఇదివరకెపుడో కుదురు లేని దూడ పిల్ల పులి ముందుకెళ్ళి డాన్స్ చేసిందిట! నా వెనక నించున్న నాగబాబు గాడికి ఉన్నట్టుండి ఎక్కడలేని చిలిపితనం ముంచుకొచ్చి నిక్కర్లో నీట్ గా టక్ చేసి ఉన్న నా చొక్కాని సాంతం బైటకి లాగా

బోయినం

ఆ రోజు అప్రయత్నంగా వంట డ్యూటీ నాగబాబుకి ఇచ్చేసి డిక్షనరీ పక్కన పెట్టుకుని హిందూ పేపర్ చదువుకుంటున్నాను. "ఒరేయ్, పప్పులో ఉప్పెంత వెయ్యాలి ?" అడిగాడు నాగబాబు. "ఒక చారెడు వెయ్ " తల తిప్పకుండా సమధానం చెప్పా. "మరి చారేమో గిన్నెడు ఉంది కదరా ?" ఈ సారి తలెత్తి చూడకుండా ఉండలేకపోయాను. వంటింటి గుమ్మంలో బనీనుతో కుడి చేతిలో గరిట పట్టుకుని ఎడం చెయ్యి నడుం మీద వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్నాడు వాడు. "ఒరేయ్ బడుద్ధాయ్, నీకు తెలుగొచ్చా అసలు ?" అరిచాను. " ఓహో అర్ధం అయింది లే, అరుస్తావెందుకు ? చారిగాడు పెరుగు తెస్తానని బైటకి వెళ్ళాడు ఇప్పుడే. వాడొచ్చే దాకా ఆగాలంటే కష్టం" అన్నాడు నాగబాబు. ఈ రోజు హిందూ పేపరు అనవసరంగా కొన్నట్టున్నాను. "ఒరేయ్ సన్నాసీ, చారెడు అంటే ఇంత" అన్నాను అరచేతిలో నాలుగువేళ్ళ మీద బొటనవేలు మడిచి చూపిస్తూ, "అయినా నీకు తెలుగూ రాదు, వంటా రాదు; ఇలా ఐతే ఎదో ఒక టీవీ ఛానల్లో వంటల ప్రోగ్రాంలో యాంకర్ కింద సెటిల్ అవ్వాల్సొస్తుంది జాగ్రత్త !" శపించా. వాడు పగలబడి నవ్వి లోపలికెళిపోయాడు, పొగిడాననుకున్నాడో ఏమో! అ