Skip to main content

అదిగో పులి - 3

యమదేవుడు వేరే పన్లో బిజీగా ఉన్నాడో ఏమో, ఏ అనర్ధం జరక్కుండా బస్సు బెంగుళూరులో ఆగింది. దిగగానే అందరూ ఆకలి మీద ఉండడంతో హోటలు వెతుక్కుంటూ వెళ్ళాము. హోటలు కనిపించగానే నీలమేఘం గట్టిగా నవ్వడం మొదలెట్టాడు. ఏంటన్నట్టు అందరం ఆయిన వైపు చూసాం.

"ఈ బెంగుళూరు వాళ్ళకీ....", పొట్ట పట్టుకుని ఇంక నా వల్ల కాదన్నట్టు చెయ్యూపుతున్నాడు.
"ఏంటి ?" అడిగాను.

"వీళ్ళకేంటో అన్నీ డౌట్లేనయ్యా.. చూడు.. 'హోటలో బృందావనో' అని రాసుకున్నారు. ఏంటో తెలీనప్పుడు ఎందుకు పెట్టినట్టో ! వెర్రి వెంగళప్పలు. " అన్నాడు గట్టిగా.

పర్లేదే, ఓవరాక్షను పక్కన పెడితే వీడిలోనూ కొంచెం సెన్సాఫ్ హ్యూమరున్నట్టుంది!

ఇంతలో "What can I do for you ?" ఒక గొంతు వినపడింది.
ఎవడో జీన్సు పాంటు మీద ఫార్మల్ షర్టు, టై కట్టుకుని నిలబడ్డాడు. సన్నగా గడ్డం పెంచుకుని చల్లద్దాలు పెట్టుకుని ఉన్నాడు. ఇంకా పరీక్షగా చూసాను. సోడాబుడ్డి కూలింగ్లాసెస్ ! అదే చూడ్డం !

"ఐ యాం వెంగళప్పా - The Cool Geek" అన్నాడు.

అదేదో సినిమాలో ఎవడో కధ రాస్తే అందులో కారెక్టర్లు ఎదురుగుండా ప్రత్యక్షమయినట్టు, ఎవరెవరో దాపురిస్తున్నారు. అర్జెంటుగా ఆ రాసేవాణ్ణి చంపేసి కధలో కారెక్టర్ని చేసి పడెయ్యాలి.

నేను వెంటనే నాగబాబు గాణ్ణి చూపించి "మేము పిలిచింది వెంగళప్పా - The wonder kidని, కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు" అని వాణ్ణి పంపించేసాను.

లోపలికెళ్ళాక నీలమేఘం గాడు ఎవణ్ణో చూపించి "పొద్దుటే టిఫిను కింద స్వీటు తింటున్నాడు పిచ్చి వెధవ " అనబోతుంటే వాడి నోరు నొక్కేసి,
"ఇక్కడ తిక్కతిక్కగా మాట్లాడితే మక్కెలిరగదీస్తారు. మీరు నోరు మూసుకునుంటే మీకూ మాకూ మంచిది" అని హెచ్చరించాను.

హోటలు నించి బయిటకు రాగానే నీలమేఘంగాణ్ణి పిలిచి "సార్, బెంగుళూరులో మీ ప్రోగ్రామేంటో చెప్తే..దాన్ని బట్టి కేరళ ఎప్పుడు వెళ్ళేదీ ప్లాన్ చేస్కుంటాం." అన్నాను.

"ఒక కన్నడ డైరెక్టర్కి కధ చెప్పాలయ్యా, ఇవాళ రాత్రికల్లా కేరళ బయలుదేరతాను."
సరేననని వీడ్కోలు చెప్పి పరమానందంగా అవతలపడ్డాం.

"మరి రాత్రి వరకూ ఏం చేద్దాం రా" అడిగాడు నాగబాబుగాడు.,
వాణ్ణి చూసి నవ్వి, "పిచ్చి వాడా, మనం ఇప్పుడే బయల్దేరుతున్నాం" అన్నాను.
"మరి నీలమేఘంగారూ ?"
"ఇంకో మాట మాట్లాడావంటే వాడితోనే నీ ట్రిప్పు. నువ్వే తేల్చుకో, వాడో, మేమో !"

చేసేదేం లేక అయిష్టంగా బయల్దేరాడు వాడు.

మొత్తానికి ఎలాగోలా ഗോഡ്'സ ഓവന്‍ കണ്‍ട്രി (God's own country) చేరుకున్నాం.

ఎదురుగుండా ఉన్న టీ కొట్టుకెళ్ళి అందరికీ టీ చెప్పగానే, తలో లీటరూ ఇచ్చాడు వాడు. ఒక గంట సేపు గప్పాలు కొట్టుకుంటూ అది తాగాక, ఆ ఊరి పేరేంటో అడగితే ఎదో 'తొక్కుడు' అని చెప్పాడు ఆ హోటలు వాడు. తేడాలొస్తే కింద పడేసి తొక్కి, తుక్కు తుక్కు చేసొదిలి పెట్టేలా ఉంది వాడి వాలకం. తరవాత తెలిసింది 'తేక్కడి'ట.

అక్కడేం చెయ్యొచ్చో వాళ్ళనీ, వీళ్ళనీ కనుక్కుంటే, ఏదో చిన్న అడివి ఉంది చూసిరండని చెప్పారు. నాగబాబుగాడికి చెప్దామని చూస్తే వాడు లేడు. చుట్టూ చూసాను. అవతలెక్కడో ఒక కాన్స్టెబుల్తో మాట్లాడుతున్నాడు వాడు.

ఒస్తూనే, "కేరళ పోలీసులు భలే చురుకైన వాళ్ళురా, నన్ను చూడగానే ఎక్కణ్ణించి ఒచ్చాం, ఏం చేస్తున్నాం అని అడుగుతున్నారు. ఆంధ్రా వాళ్ళంటే అభిమానమనుకుంటా" అన్నాడు.

"మన వాళ్ళూ, వీళ్ళూ ఫోటోలూ సమాచారం ఇచ్చి పుచ్చుకుంటారులే !" అన్నాను, వాడేమంటాడో చూద్దామని.

"మంచిదేగా, ప్రపంచంలో స్కాట్లండ్ యార్డు పోలిసుల తరవాత వీళ్ళే బెస్టు, తెలుసా !" అన్నాడు.
నేనన్నది వీడికి అర్ధమయినట్టు లేదు !

తరవాత గ్రూపు మొత్తాన్నీ సమావేశపరిచి ఇలా ఇలా అడివి ఉందీ, వెళ్ళి జంతువులూ గట్రా చూసి రావొచ్చని చెప్పాను.

"ఐతే హైకింగ్ చెయ్యొచ్చు" అన్నాడు విజయ్ గాడు.
"ట్రెక్కింగ్ కుడా చెయ్యొచ్చు" అన్నాడు బీరేష్ గాడు.
నాగబాబుగాడికి మళ్ళీ ఆవేశం ఒచ్చింది. " ఓరేయ్, ఇలా చాటింగ్లో నేర్చుకున్న భాష నా దగ్గర వాడకండి. మనం చిన్నప్పట్నించీ అలవాటున్న వాకింగ్ చేద్దాం" అన్నాడు.

విశాల్ గాడు మాత్రం ఎదురుగుండా ఉన్న బార్ చుపించి "ఒరేయ్, మనం చీకటి పడే దాకా అక్కడ కూర్చుని ఆ తరువాత ఆకాశంలో నక్షత్రాల్ని చూద్దాం రా" అన్నాడు.

వాడలా అనడం ఆలస్యం, అందరూ సరేనన్నారు.

నాగబాబుకి విపరీతమైన కోపమొచ్చింది.
"ఆకాశంలో నక్షత్రాల్ని చూడ్డానికైతే ఎవడింటి డాబా మీద వాడేడవచ్చు కదరా...ఇక్కడి దాకా ఎందుకొచ్చారు ?" తేక్కడి దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు.

ఛా, వీడికి ఈసారి కూడా విషయం అర్ధమవలేదు.

మొత్తానికి వాళ్ళనీ వీళ్ళనీ కనుక్కుని, ఆ అడివి దగ్గరకెళ్ళాం.

బయిట హిట్లరు మీసాలూ, ఖాకీ డ్రస్సు తగిలించుకుని ఒకడు బట్లరింగ్లీషులో పలకరించాడు. నా పేరు అని చెప్పి ఏదో నమిలాడు. నాగబాబుగాడికి అర్ధం కాక మళ్ళీ అడిగితే, మళయాళంలో రాసున్న నేం ట్యాగ్ చూపించాడు.

ఇలా కాదని వాణ్ణి పక్కకి తీసుకెళ్ళి ఒక పది నిమిషాలు రహస్యంగా మాట్లాడాడు నాగబాబుగాడు.

ఎగురుకుంటూ వెనక్కొచ్చి "ఒరేయ్, ఇక్కడ పులులూ, సింహాలూ, ఏనుగులూ అన్ని ఉన్నాయిట్రా, వాడు చూపిస్తానన్నాడు. ఇవాళ మంచి అడ్వెంచర్ చెయ్యబోతున్నాం !" అన్నాడు.

"ఎందుకొచ్చిన రిస్కురా, బతికుంటే వీడిలా బంగాళా దుంపయినా తినొచ్చు. మనం వెనక్కి వెళ్ళిపోయి ఇందాక విశాల్ గాడు చెప్పింది చేద్దాం" అన్నాను బీరేష్ గాణ్ణి చూపించి.

"హాఠ్ ఠూఠ్ ఛట్ ఫట్ ఫట్ ఢాం ఢూం" అన్నాడు నాగబాబుగాడు.

తరువాతి సీన్లో ఆడవిలో ఉన్నాం.

సన్నగా హెలికాప్టరు చప్పుడులా అవుతుంటే తల పైకెత్తి చూసాం నేను, గార్డు గాడు. ఏమి కనిపించలేదు. చుట్టూ చూసాం. ఊత్సాహం వందింతలై చేతిలో మ్యాపు వీర ఊపుడు ఊపుతున్నాడు నాగబాబుగాడు.

"ఏంటయ్యా మీ వాడు ఇంత టెన్షన్ పడుతున్నాడు, ఫస్టు టైమా ?" గార్డు గాడు అడిగాడు.
"లేదండీ, ఇదివరకూ చాలా సార్లు టెన్షన్ పడ్డాడు. అసలు చిన్నప్పట్నించీ ఇంతే !"

వాడు ఒకసారి బుర్ర గోక్కుని మళ్ళీ వెనక్కి తిరిగి చూళ్ళేదు.

హిట్లరు మీసాలగాడు ముందుండి అందరినీ నడిపిస్తూ చెప్తున్నాడు.
"ఇది చాలా ప్రమాదకరమయిన అడివి, నేను చెప్పిన దారిలోనే నడవండి".
మా వెనకాల మిగితా వాళ్ళతో పాటూ ఇద్దరు తెల్లమ్మాయిలు కూడా ఉన్నారు. మిగితా వాళ్ళెవరో ఎవ్వరం చూళ్ళేదు.

పోయినేడు ఈ టయిముకి ఏం చేస్తున్నారో దగ్గరనించి, ఇక్కణ్ణించి బయిటపడ్డాక ఏం తినాలో వరకూ ఏది వదలకుండా ఎవరి గోల వాళ్ళు మాట్లాడుతూ నడుస్తున్నారు అందరూ.

ఉన్నట్టుండి గార్డుగాడు అగమన్నట్టు చెయ్యి గాల్లో ఉంచి 'ష్..ష్..' అన్నాడు. నాగబాబు గాడికి 'స్..స్..' అని వినబడి 'ఆ ఏంటి, నోటితో చెప్పొచ్చుగా ?" అన్నాడు గట్టిగా.

గార్డుగాడు వెనక్కి తిరిగి కళ్ళెర్ర జేసి, నోటి మీద వేలేసి చూపించాడు.

ఎదురుగుండా పొదల్లో చిన్న అలికిడి అనిపించింది. అందరం ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నాం. గార్డు గాడు తెల్లమ్మాయిల్ని కెమేరా రెడీగా పెట్టుకోమని సైగ చేసాడు. ఇంకో చిన్న కదలిక. మళ్ళీ హెలికాప్టరు చప్పుడు మొదలయింది.
ఈసారి తెల్లమ్మాయిలు నోటి మీద వేలేసుకుని చూపించారు నాగబాబుగాడికి.
అంతలో ఒక ఉడత బయిటకొచ్చి చుట్టు చూసి మళ్ళీ వెళ్ళిపోయింది.

ఇలా ఒక పది 'ష్ ష్'లు, అలికిళ్ళు, హెలికాప్టర్ చప్పుళ్ళు, ఉడతలూ, మిడతలు, కుందేళ్ళు అయిపోయాయి.
నాగబాబు గాడి ఉత్సాహం కాస్తా అసహనంగా మారుతోంది.

గార్డు గాడు మళ్ళి ఇంకో చోట ఆపి, "ఇది పులులూ, ఏనుగులూ ఉండే చోటు జాగ్రత్త !" అన్నాడు.

"ఈసారి గనక ఏమి చూపించకపోతే నీ సంగతి చెప్తాను" అరిచాడు నాగబాబుగాడు.

ఇంకొంచం దూరం వెళ్ళగానే, అక్కడేదో ఉంది చూడమన్నాడు గార్డు నాగబాబుతో.

నాగబాబుగాడు అక్కడి చెత్తంతా ఊడ్చేసి, దేన్నో చూపించి "ఏంటిది ?" అడిగాడు.
"ఏనుగు పేడ. ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే ఎక్కడో ఏనుగు కూడా ఉంటుంది. నువ్వు దాన్ని వెతగ్గానే, పులి గురించి ఆలోచిద్దాం. మిక్కిలి సంతోశమా ?" అన్నాడు గార్డు గాడు.

"పులిని చూపిస్తానని పేడని చూపిస్తావురా, నీ మన్నూ...దీనికి మళ్ళీ మిక్కిలి సంతోసమా అని వెక్కిరిస్తావా, ఈ రోజు నువ్వు చచ్చావ్ నా చేతులో" అని వాడి వెనక పరిగెట్టాడు నాగబాబుగాడు.

ఈ గొడవ ఇప్పట్లో తేలదని చెప్పి మేము ఆకాశంలో నక్షత్రాల్ని చూడడానికి వెళ్ళిపోయాం.

ఒక రెండు గంటలు గార్డు గాడి వెనక పరిగెట్టిన నాగబాబుగాడు, వాడి ఈకల టొపీ, మళయాళం నేం టాగు పట్టుకుని విజయగర్వంతో తిరిగొచ్చాడు.


(సమాప్తం)

Comments

Unknown said…
Awesome narration babai...
appude aipoinda?
Sravya V said…
:)మరి తరవాత సిరీస్ ఎప్పుడు ?
బాగా రాస్తున్నవు. ఏలినాటి శని నీకు కూడా మొదలయింది కదా ప్రభావం కనిపిస్తోంది శని శ్తోత్రం చదువు.
బాబాయ్ కరకరలు కి విరామం ఇచ్చావా? నీ కొత్త కధ కోసం ఎదురు చూస్తున్నా.
వేమన said…
ఈ మధ్యన కొంచెం పని చెయ్యల్సొచ్చింది. ఈ సెలవుల్లో రాయడం కుదురుతుందేమో మళ్ళీ :)

Popular posts from this blog

నేను, దేవుడు, మా నాన్న - 2

మర్నాడు ఆదివారం కావడంతో మా పిల్లకాయల పార్టీ సర్వ సభ్య సమవేశం మొదలైంది. పక్కింట్లో ఉండే బుజ్జి గాడూ, వాళ్ళ తమ్ముడు పండు గాడు, వాళ్ళ పక్కింట్లో ఉండే శీనుగాడూ, వాళ్ళ చెల్లి కవిత హాజరయ్యారు. అధ్యక్షత వహిస్తున్న మా చెల్లి డయిలాగులేవీ లేకుండా "ఓ పియా పియా.. ఓ పియా పియా " అంటూ ఇళయరాజా పాటని ప్రళయ రాగంలో విలయ తాండవం చేయించింది. అయిదు నిమిషాలయినా పాట ముందుకి కదలకపోవడంతో అందరూ వెళ్ళిపోక ముందే దాన్ని కూర్చోబెట్టి నేను మొదలెట్టాను. "జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట.. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ అనాథలైనా అభాగ్యులైనా అంతా నా వాళ్ళూ ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరూ" అంటూ వేలు చూపిస్తూ గుండ్రంగా తిరుగుతూ...ఆపేసాను - వీధి చివర చారిగాడు కనిపించాడు. మామూలుగా పరిగెట్టడం మానేసి గుర్రం ఎక్కి ఒస్తున్నట్టు గెంతుకుంటూ ఒస్తున్నాడు వాడు. ఒస్తూనే పక్కకి లాక్కెళ్ళి, "ఒరేయ్, మా నాన్న జేబులో యాభై రూపాయిలు దొరికాయి రా, మనం ఫైవ్ స్టార్ చాక్కెట్ట్లు కొనుక్కుందాం పద" అన్నాడు. అసలు వీడు గుండెలు తీసిన బంటు కాకపోయినా కనీసం గుండు చేసి ఒదిలిపెట్టే బంటు అని అప్పటికే నాకు అను

నేను, దేవుడు, మా నాన్న - 1

ఆ రోజు స్కూల్లో ఘోర పరాభవం జరిగింది.అసలు రోజూ స్కూల్ కి ఎందుకు వెళ్ళాలో అర్ధం గాక ఏడుస్తూ వెళ్తుంటే ఈ అవమానాలోటీ - బాలయ్య సినిమానే చూడలేక చూస్తుంటే, మధ్యలో విజయ్ కాంత్ డబ్బింగ్ సినిమా ట్రైలర్ వేసినట్టు ! సరే, అసలేం జరిగిందో చెబుతాను. ఆ రొజు పొద్దుటే స్కూల్లో ప్రెయెర్ జరుగుతోంది. రెండో క్లాసు వాళ్ళం కావడంతో తగిన గౌరవం ఇచ్చి ముందు నించోబెట్టారు. ఎదురుగా మా హెడ్మాష్టరు నించున్నాడు. వాడి పేరు వలవన్. పెద్ద పెద్ద మీసాలేసుకుని ఒక లోటాడు టీ తాగుతూ తిరిగే వాడంటే మాకు హడల్. మా టీచరుకి అంతకంటే హడల్ అని నా నమ్మకం. ఎందుకంటే క్లాసు రూము పక్క నించి వాడు వెళ్ళినప్పుడల్లా మా అందరికంటే ముందు మా టీచరు నోటి మీద వేలేసుకునేది. అది చూసి మేము కూడా వేసుకునేవాళ్ళం. అసలు వాడి లాంటి వాళ్ళని స్కూల్లో ఉంటే వలవన్ అంటారనీ, బైటకొచ్చి దేశం మీద పడితే వీరప్పన్ అంటారనీ తరవాత తరవాత, కొంచెం లోక ఙానం ఒచ్చాక తెలిసింది. ఇదివరకెపుడో కుదురు లేని దూడ పిల్ల పులి ముందుకెళ్ళి డాన్స్ చేసిందిట! నా వెనక నించున్న నాగబాబు గాడికి ఉన్నట్టుండి ఎక్కడలేని చిలిపితనం ముంచుకొచ్చి నిక్కర్లో నీట్ గా టక్ చేసి ఉన్న నా చొక్కాని సాంతం బైటకి లాగా

బోయినం

ఆ రోజు అప్రయత్నంగా వంట డ్యూటీ నాగబాబుకి ఇచ్చేసి డిక్షనరీ పక్కన పెట్టుకుని హిందూ పేపర్ చదువుకుంటున్నాను. "ఒరేయ్, పప్పులో ఉప్పెంత వెయ్యాలి ?" అడిగాడు నాగబాబు. "ఒక చారెడు వెయ్ " తల తిప్పకుండా సమధానం చెప్పా. "మరి చారేమో గిన్నెడు ఉంది కదరా ?" ఈ సారి తలెత్తి చూడకుండా ఉండలేకపోయాను. వంటింటి గుమ్మంలో బనీనుతో కుడి చేతిలో గరిట పట్టుకుని ఎడం చెయ్యి నడుం మీద వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్నాడు వాడు. "ఒరేయ్ బడుద్ధాయ్, నీకు తెలుగొచ్చా అసలు ?" అరిచాను. " ఓహో అర్ధం అయింది లే, అరుస్తావెందుకు ? చారిగాడు పెరుగు తెస్తానని బైటకి వెళ్ళాడు ఇప్పుడే. వాడొచ్చే దాకా ఆగాలంటే కష్టం" అన్నాడు నాగబాబు. ఈ రోజు హిందూ పేపరు అనవసరంగా కొన్నట్టున్నాను. "ఒరేయ్ సన్నాసీ, చారెడు అంటే ఇంత" అన్నాను అరచేతిలో నాలుగువేళ్ళ మీద బొటనవేలు మడిచి చూపిస్తూ, "అయినా నీకు తెలుగూ రాదు, వంటా రాదు; ఇలా ఐతే ఎదో ఒక టీవీ ఛానల్లో వంటల ప్రోగ్రాంలో యాంకర్ కింద సెటిల్ అవ్వాల్సొస్తుంది జాగ్రత్త !" శపించా. వాడు పగలబడి నవ్వి లోపలికెళిపోయాడు, పొగిడాననుకున్నాడో ఏమో! అ