Skip to main content

ఎడ్డెం - తెడ్డెం - అడ్డం

గమనిక - ఈ కింద రాసిన అబద్ధాలు ఒక దానికోటి సంబంధం ఉండకపోవచ్చు, ఈ వాక్యంతో సహా.

అదొక జన సంచారం లేని అడివి. చుట్టూ చూడకుండా, తల తిప్పకుండా, ధైర్యంగా నేను అందులో పడి నడుస్తున్నాను.
కొంత దూరం వెళ్ళగానే ఒక బోర్డు కనిపించింది, దారిని రెండు పాయలుగా చీలుస్తూ. రూట్-1, రూట్-2 అని రాసుంది. అది చూడగానే కొపం ఒచ్చి, ఆ బోర్డు ఊడబీకి, అక్కడున్న రాయి మీద కాసేపు కూర్చుని మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ పోయాను.

ఉన్నట్టుండి మెలకువ ఒచ్చింది. బద్ధకంగా టివీ ఆన్ చేసాను. బాబా రాందేవ్ గారు ఏవో భంగిమలు ప్రదర్శిస్తున్నారు. చుట్టూ జనాలంతా అలాగే చేద్దాం అని ప్రయత్నిస్తున్నారు. లోకంలో హిట్లరూ, సద్దాం హుస్సేనూ లాంటి వాళ్ళు ఉండేవారంటే ఆశ్చర్యమేముంది? ఇంత మంది పొద్దుటే నిద్ర మానుకుని చిత్రహింసలు పడడానికి రెడీగా ఉంటే !

తయారవుతూ ఆలోచిస్తున్నాను.

అయినా మనుషులు రకరకాలు.

'ముల్లుని ముల్లుతోటే తియ్యాలి ' అని వంట బట్టించుకున్న వాళ్ళు ఉంటారు, అంటే మాములు మనుషులన్న మాట.
ముల్లుని గడ్డపారతోనో, ఇంకా పెద్ద దాంతోనో తియ్యబోయే వాళ్ళని కూడా చూసాను - ఉదాహరణకి చారిగాడు.

ఒక రోజు ఒచ్చి, సీరియస్ గా "రేయ్, నాకు బాగా తలనెప్పిగా ఉంది - పద,తెలుగు సినిమాకి వెళ్దాం"అన్నాడు...ఏం చెప్పను ?

కప్పు టీకి ఆశపడి కనీసం గంట పాటూ నెత్తిన పెద్ద సుత్తితో బాదించుకోడానికి రెడీ అయిన వాళ్ళనీ చూసాను. మా ఇంటికి ఒచ్చే వాళ్ళు చిన్నప్పుడు.

'కుడి యెడమయితే పొరబాటు లేదోయ్' అని డిసయిడు అయిపోయిన వాళ్ళూ ఉంటారు -

"ఈ రామ్మూర్తీ, కృష్ణయ్యల్లో ఏం చెప్తారో తెలీదుగానీ, ప్రతి సంవత్సరం ఇంత మంది ఎగబడి వస్తూంటారు ఐఐటీ కోచింగుకి" అన్నాడు మదన్ గాడు ఒకసారి.

ఇంకోసారెప్పుడో డ్రయివు చేస్తుంటే, "ఒచ్చె సిగ్నల్ దగ్గర లెఫ్టు తీసుకో" అన్నాడు.
నేను వాడు చెప్పినట్టే లెఫ్టు తిప్పబోతుంటే,
"అయ్యో లెఫ్టు, లెఫ్టూ" అని అరుస్తున్నాడు తల పట్టుకుని.
నాకు అర్ధంగాక అయోమయం మొహంతో వాడి వైపు చూస్తూ అంతకంటే కంగారుగా తిప్పేసరికి,
'Lost and Clueless' (Fast and Furios కి confused వెర్షను)లైవులో చూసారు జనాలు.
"నేను చెప్దామనుకుంది రైటు" అని ఇకిలించాడు చివరికి.

ఇంకా ఉన్నాయి రకాలు -

రోజూ నేను స్కూలుకి వెళ్ళే టైముకి, మళ్ళీ ఇంటికి ఒచ్చే టైముకీ 'ఉగాది' సినిమా పాటలు పెట్టి నా గతంలో ఒక మాసిపోని మనో గాయం మిగిల్చిన మా పక్కింటివాడి లాంటి వాళ్ళూ,

బ్యాటింగ్ చేసేవాడు ఇంజమాం ఉల్ హక్ అయినా, Incredible Hulk అయినా, వేసిన బంతిని స్టేడియం అవతలకీ, ఊరవతలకీ కొడుతున్నా, ఏ మాత్రం తొణక్కుండా నింపాదిగా అలాగే వేసి వికెట్లు తీసే వెంకటపతిరాజు లాంటి వాళ్ళూ,

పురుగు కనిపిస్తే చంపలేక దాన్నో సీసాలో వేసి మూత పెట్టి బయిట పారేసే వాళ్ళూ,

"అదా, ఇదా ?" అని ఎవరయినా నిలదీస్తే, గదిలోకెళ్ళి తలుపేసుకునే నాలాంటి వాళ్ళూ...
దేన్నయినా అలా నిలదీసి అడిగే నాగబాబుగాడి లాంటి వాళ్ళూ..

ఏవిటో, ఇన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తేగానీ ఆఫీసుకెళ్ళే మూడ్ రాదు !


ఎలాగోలా రెడీ అయ్యి ఆఫీసు చేరుకుని, కాంటీనుకెళ్ళాను.
ఇడ్లీ అని చెప్పాను.
"సాంబార్ ఇడ్లీనా, సాదా ఇడ్లీనా ?" అడిగాడు వాడు.
నా కళ్ళు ఎరుపెక్కాయి.
"ఇడ్లీ కాకుండా ఏముంది ?" అడిగాను.
"పెసరట్టు, దోశ"
"పెసరట్టు" అన్నాను.
"ఆనియన్ పెసరట్టా, ఉప్మా పెసరట్టా ?" అడిగాడు వాడు.
అక్కడికక్కడ వాడి కాలరు పట్టుకుని కొడదాం అనిపించినా, సభ్యత కాదని ఊరుకున్నాను.
"పెసరట్టు కాకుండా దోశా ?" అడిగాను మళ్ళీ.
"దోశ - ప్లేన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ" అన్నాడు వాడు.
"మసాలా దోశ" తడుముకోకుండా చెప్పాను.

మళ్ళీ మా జీతాలు పెరిగినప్పటికి కానీ ఆ దోశ రాదని తెలుసు కాబట్టీ ఆలోచించడం మొదలు పెట్టాను.

పొద్దుటే ఒచ్చిన కల గుర్తొచ్చింది. ఎందుకు ఒచ్చి ఉంటుందా అనిపించింది.

క్రికెట్టు మ్యాచు చూస్తుంటే ఒచ్చీ పోయే కరెంటులా.. ఉండి ఉండి ఏదో గుర్తుకు ఒస్తోంది.

----------------------------------------------------------------------

"ప్రయాణం అన్నాక ఓపిగ్గా ముందునించే అన్నీ సర్దుకోవాలీ, లేకపోతే చకచకా అప్పటికప్పుడు తెమలాలి, నువ్వు రెండూ చెయ్యవు" అమ్మని విసుకున్నాడు మా నాన్న.

మా తాతగారింటికి వెళ్తున్నాం.

రైలు బండి అంటే అదో సరదా. ఆ ఉత్సాహంలో కంపార్టుమెంటు ఆ చివరి నించి ఈ చివరి వరకూ అందరి మొహాలూ చూస్తూ పరిగెడుతున్న నన్ను, "ఒరేయ్, ఒక చోట కుదురుగా కూర్చో లేకపోతే కళ్ళు మూసుకుని పడుక్కో. అటూ ఇటూ తిరిగావంటే డొక్క చీరేస్తాను" అని గద్దించాడు మా నాన్న.

మొత్తానికి మా తాతగారింటికి చేరుకున్నాం.
స్నానాలు అయిపోయాక భోజనాలకి కూర్చున్నారు అందరు.

"మనిషన్నాక బాగా వండడం అన్నా రావాలి, లేకపోతే బాగా తినడం అన్నా రావాలి - నీకు రెండూ రావు" విసుకున్నారు తాతగారు సరిగ్గా కుదరని కూరనీ, సన్నగా ఉండే మా అమ్మమ్మనీ చూసి. అమ్మమ్మ నవ్వింది. ఈయిన్ని చూసే మా నాన్న కూడా నేర్చుకున్నాడేమో తిట్టడం.

వినోదం చూస్తూ నా పాటికి నేను అప్పుడప్పుడే నేర్చుకున్న స్టైల్లో తింటున్నాను, ఒక వేలు ఒదిలేసి మూడు వేళ్ళతో. మా అమ్మమ్మ అది చూసి "ఏవిటా తినడం, అన్నం అరిచేతినంటితే ఆకలి ఆకాశాన్నంటుతుంది అన్నారు, సరిగ్గా తిను" అంది.

నాకు లీలగా ఏదొ అర్ధం అవుతూ ఉంది అప్పుడప్పుడే.

కాసేపు తిన్నాక ఇంక ఆపోలేదు. ఎంతయినా భోజనం టిఫిన్ అంత బావుండదు కదా !

ఇంక చాలని లేవబోతూంటే, "మగ పిల్లాడన్నాక ఒక ముద్ద తక్కువయితే ఓర్చుకోవాలి, ఒక ముద్ద ఎక్కువయితే అరాయించుకోవాలీ, ఏవిట్రా నువ్వు" అంది.

నాకు విషయం పూర్తిగా బోధపడింది. ఎవరినయినా ఒక మాట అనాలంటే, వాళ్ళు చెయ్యలేని రెండు పనుల్ని ఆప్షన్స్ గా ఇవ్వాలన్నమాట !

నాకు కలిగిన ఈ ఙానాన్ని ఎవరి మీదయినా ప్రయోగిద్దాం అనుకున్నాను.

మా మావయ్య గుర్తొచ్చాడు. మొన్నో రోజు నన్ను వెక్కిరించాడు.
"నువ్వు పెద్దాయ్యాక పెద్ద ఆఫీసరు అవుతావు, కాని పొడుగవ్వవు, కుర్చీ మీద ఇంకో స్టూలు వేసి నిన్ను కూర్చోబెడతారు" అని.

వెంటనే మా మావయ్య దగ్గరకెళ్ళాను. రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరుతున్నాడు.

"మావయ్య అన్నాక అయిసుక్రీమన్నా కొని పెట్టాలి, లేపోతే చిరంజీవి సినిమాకయినా తీసుకెళ్ళాలి.. ఏదో ఒకటి చెయ్" అన్నాను.
"ఇప్పుడు కాదు... నేను మా ఫ్రెండ్సు దగ్గరికి వెళ్తున్నా.. తప్పుకో"

"కుదరదు.. ఏదో ఒకటి చెయ్యాల్సిందే" అరిచాను.

"నాకు టయిము అవుతోంది.. తప్పుకో" అని పక్కకి తోసేసాడు.

"నాకు తెలుసు.. నువ్వు చిరంజీవి సినిమాకి వెళ్తున్నావ్.. నన్నూ తీసుకెళ్ళు" అని మా మావయ్య షర్టూ, పాంటూ, కాళ్ళూ, చేతులూ, గడ్డం పట్టుకుని వేళ్ళాడుతూ బెదిరించాను.

మా మావయ్యకి కోపమొచ్చి గూబ మీద ఒక్కటిచ్చాడు. తేరుకుని, ఏదో ఒకటి చేద్దాం అనుకునేలోపు వెళ్ళిపోయాడు.

ఆ రోజు నించి నేనో పెద్ద రెబెల్ గా మారిపోయాను. నా బారిన పడని పెద్ద మనిషి లేడు.. మా నాన్నతో సహా. నేను చూస్తుండగా బయిటికి వెళ్ళడానికి భయపడ్డారు కొన్ని రోజులు.. ఎక్కడ వెంటపడి ఒస్తానో అని.

ఒక రోజు పక్కింటి శీను గాడు అడ్డం పడి సైకిల్ తొక్కుతూ కనిపించాడు.
వెంటనే మా నాన్న దగ్గరకి వెళ్ళాను. "నాన్నా..నాకు సైకిల్ కొనివ్వు.. లేకపోతే నీ సైకిల్ ఇచ్చెయ్" అన్నాను. నా పెంకితనానికి అప్పటికే అలవాటు పడ్డ మా నాన్న, ఏమీ మాట్లాడకుండా బెల్టు తీసాడు.

కాలం కలిసి రానప్పుడు ఏదయినా బెల్టు అయ్యి కాటేస్తుందని నాకు అప్పటికే తెలుసు కాబట్టి సైలెంటయిపోయాను. ఆలోచిస్తే నాకో ఉపాయం తోచింది.

మరుసటి రోజు పొద్దున్నే మా ఇంటికి ఒచ్చే పాలవాడు బలయిపోయాడు. ఆ తరవాత పేపర్ వాడు, పోస్టుమాను.

ఇలా ఒచ్చిన వాళ్ళ అందరి సైకిళ్ళూ ఎత్తుకెళిపోతుంటే, వాళ్ళందరూ మా వీధి చివర కానిస్టేబుల్ ఇంటికెళ్ళి నా మీద కేసు పెట్టమని మొరపెట్టుకున్నారు.

స్వతహాగా తెలివయిన ఆ కానిస్టేబుల్ "ఇప్పుడు వాడు నిక్కర్లు వేసుకుంటున్నాడు, రేప్పొద్దున్న అవి పొట్టి అయిపోతాయ్... అప్పటికీ వాళ్ళ నాన్న సైకిల్ కొనివ్వకపోతే వాడు నా లూనా ఎత్తుకు పోతాడు - మీరు చెప్పినట్టు నేను చేస్తే. కాబట్టి ఈ విషయం మీరు మీరూ తేల్చుకోండి" అని చెప్పి పంపించాడు.

ఈ విషయం మా నాన్నకి తెలిసి నా తిక్క ఎలా కుదర్చాలా అని ఆలొచించాడు.

ఒక వారం పోయాక, నన్ను మా ఇంటి పక్కన ఉండే ఆయిన దగ్గరకి ట్యూషనుకి పంపించారు.

మరో రెండు రోజులు బాగానే గడిచాయి. మూడో రోజు నోట్సు రాయమంటే పెన్ను ఎక్కడో పారేసి పెన్ను లేదని చెప్పాను. ఆయిన నా వైపు కోపంగా చూసాడు.

తిడతాడు, కొడతాడు అని ఒక్కో వేలికీ ఒక్కో ఆప్షన్ అనుకుని - చేతులు కట్టుకుని చూస్తున్నాను, ఆ రెండు వేళ్ళూ అలాగే ఉంచి. ఆయిన ఏమీ చెయ్యలేదు.
ఆ రోజు నించీ, నేనూ నా స్టైల్లో ఏ పని చేసినా అలా కోపంగానే చూసేవాడు. తరవాత ఏం చేస్తాడో అర్ధం కాక నేను కామయిపోయేవాణ్ణి.

రోజులు గడిచే కొద్దీ నేను అలా ఒక బుధ్ధిమంతుడిగా మారిపోయాను. ఏదో పని మీద మా ఊరొచ్చిన మా మావయ్య నన్ను చూసి ముచ్చటపడి నాకో అయిసుక్రీము కొనిచ్చి, మా ట్యూషన్ మాష్టారుతో కలిసి సినిమాకెళ్ళాడు.

ఈసారి నాకు ఎందుకో బాధనిపించలేదు.

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, ఎవరయినా మీ వైపు కోపంగా చూస్తే నవ్వండీ, ఏడవండీ, పారిపోండీ, వెనక్కి తిరగండీ, మాట్లాడండీ, డ్యాన్సెయ్యండీ... ఏదో ఒకటి చెయ్యండి..... ఏమీ చెయ్యకుండా నాలా ఉండిపోతే బుధ్ధిమంతులైపోతారు... జాగ్రత్త !

Comments

Rani said…
very funny :)
kinda unna rendu rakaalu naalo unnaayi :((

ఇంకోసారెప్పుడో డ్రయివు చేస్తుంటే, "ఒచ్చె సిగ్నల్ దగ్గర లెఫ్టు తీసుకో" అన్నాడు.
నేను వాడు చెప్పినట్టే లెఫ్టు తిప్పబోతుంటే,
"అయ్యో లెఫ్టు, లెఫ్టూ" అని అరుస్తున్నాడు తల పట్టుకుని.
నాకు అర్ధంగాక అయోమయం మొహంతో వాడి వైపు చూస్తూ అంతకంటే కంగారుగా తిప్పేసరికి,
'Lost and Clueless' (Fast and Furios కి confused వెర్షను)లైవులో చూసారు జనాలు.
"నేను చెప్దామనుకుంది రైటు" అని ఇకిలించాడు చివరికి.


పురుగు కనిపిస్తే చంపలేక దాన్నో సీసాలో వేసి మూత పెట్టి బయిట పారేసే వాళ్ళూ
Same comment as that of Rani. BTW, is your friend a left hander? (I have my own theory for this ;))
నాకు విషయం పూర్తిగా బోధపడింది. ఎవరినయినా ఒక మాట అనాలంటే, వాళ్ళు చెయ్యలేని రెండు పనుల్ని ఆప్షన్స్ గా ఇవ్వాలన్నమాట !

Thanks for the gnanam...
Manohar Dubbaka said…
Hero, so nuvvu buddimandudiga mardanikiee karanam aa tution master anaa mata,

Popular posts from this blog

నేను, దేవుడు, మా నాన్న - 2

మర్నాడు ఆదివారం కావడంతో మా పిల్లకాయల పార్టీ సర్వ సభ్య సమవేశం మొదలైంది. పక్కింట్లో ఉండే బుజ్జి గాడూ, వాళ్ళ తమ్ముడు పండు గాడు, వాళ్ళ పక్కింట్లో ఉండే శీనుగాడూ, వాళ్ళ చెల్లి కవిత హాజరయ్యారు. అధ్యక్షత వహిస్తున్న మా చెల్లి డయిలాగులేవీ లేకుండా "ఓ పియా పియా.. ఓ పియా పియా " అంటూ ఇళయరాజా పాటని ప్రళయ రాగంలో విలయ తాండవం చేయించింది. అయిదు నిమిషాలయినా పాట ముందుకి కదలకపోవడంతో అందరూ వెళ్ళిపోక ముందే దాన్ని కూర్చోబెట్టి నేను మొదలెట్టాను. "జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట.. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ అనాథలైనా అభాగ్యులైనా అంతా నా వాళ్ళూ ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరూ" అంటూ వేలు చూపిస్తూ గుండ్రంగా తిరుగుతూ...ఆపేసాను - వీధి చివర చారిగాడు కనిపించాడు. మామూలుగా పరిగెట్టడం మానేసి గుర్రం ఎక్కి ఒస్తున్నట్టు గెంతుకుంటూ ఒస్తున్నాడు వాడు. ఒస్తూనే పక్కకి లాక్కెళ్ళి, "ఒరేయ్, మా నాన్న జేబులో యాభై రూపాయిలు దొరికాయి రా, మనం ఫైవ్ స్టార్ చాక్కెట్ట్లు కొనుక్కుందాం పద" అన్నాడు. అసలు వీడు గుండెలు తీసిన బంటు కాకపోయినా కనీసం గుండు చేసి ఒదిలిపెట్టే బంటు అని అప్పటికే నాకు అను

నేను, దేవుడు, మా నాన్న - 1

ఆ రోజు స్కూల్లో ఘోర పరాభవం జరిగింది.అసలు రోజూ స్కూల్ కి ఎందుకు వెళ్ళాలో అర్ధం గాక ఏడుస్తూ వెళ్తుంటే ఈ అవమానాలోటీ - బాలయ్య సినిమానే చూడలేక చూస్తుంటే, మధ్యలో విజయ్ కాంత్ డబ్బింగ్ సినిమా ట్రైలర్ వేసినట్టు ! సరే, అసలేం జరిగిందో చెబుతాను. ఆ రొజు పొద్దుటే స్కూల్లో ప్రెయెర్ జరుగుతోంది. రెండో క్లాసు వాళ్ళం కావడంతో తగిన గౌరవం ఇచ్చి ముందు నించోబెట్టారు. ఎదురుగా మా హెడ్మాష్టరు నించున్నాడు. వాడి పేరు వలవన్. పెద్ద పెద్ద మీసాలేసుకుని ఒక లోటాడు టీ తాగుతూ తిరిగే వాడంటే మాకు హడల్. మా టీచరుకి అంతకంటే హడల్ అని నా నమ్మకం. ఎందుకంటే క్లాసు రూము పక్క నించి వాడు వెళ్ళినప్పుడల్లా మా అందరికంటే ముందు మా టీచరు నోటి మీద వేలేసుకునేది. అది చూసి మేము కూడా వేసుకునేవాళ్ళం. అసలు వాడి లాంటి వాళ్ళని స్కూల్లో ఉంటే వలవన్ అంటారనీ, బైటకొచ్చి దేశం మీద పడితే వీరప్పన్ అంటారనీ తరవాత తరవాత, కొంచెం లోక ఙానం ఒచ్చాక తెలిసింది. ఇదివరకెపుడో కుదురు లేని దూడ పిల్ల పులి ముందుకెళ్ళి డాన్స్ చేసిందిట! నా వెనక నించున్న నాగబాబు గాడికి ఉన్నట్టుండి ఎక్కడలేని చిలిపితనం ముంచుకొచ్చి నిక్కర్లో నీట్ గా టక్ చేసి ఉన్న నా చొక్కాని సాంతం బైటకి లాగా

బోయినం

ఆ రోజు అప్రయత్నంగా వంట డ్యూటీ నాగబాబుకి ఇచ్చేసి డిక్షనరీ పక్కన పెట్టుకుని హిందూ పేపర్ చదువుకుంటున్నాను. "ఒరేయ్, పప్పులో ఉప్పెంత వెయ్యాలి ?" అడిగాడు నాగబాబు. "ఒక చారెడు వెయ్ " తల తిప్పకుండా సమధానం చెప్పా. "మరి చారేమో గిన్నెడు ఉంది కదరా ?" ఈ సారి తలెత్తి చూడకుండా ఉండలేకపోయాను. వంటింటి గుమ్మంలో బనీనుతో కుడి చేతిలో గరిట పట్టుకుని ఎడం చెయ్యి నడుం మీద వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్నాడు వాడు. "ఒరేయ్ బడుద్ధాయ్, నీకు తెలుగొచ్చా అసలు ?" అరిచాను. " ఓహో అర్ధం అయింది లే, అరుస్తావెందుకు ? చారిగాడు పెరుగు తెస్తానని బైటకి వెళ్ళాడు ఇప్పుడే. వాడొచ్చే దాకా ఆగాలంటే కష్టం" అన్నాడు నాగబాబు. ఈ రోజు హిందూ పేపరు అనవసరంగా కొన్నట్టున్నాను. "ఒరేయ్ సన్నాసీ, చారెడు అంటే ఇంత" అన్నాను అరచేతిలో నాలుగువేళ్ళ మీద బొటనవేలు మడిచి చూపిస్తూ, "అయినా నీకు తెలుగూ రాదు, వంటా రాదు; ఇలా ఐతే ఎదో ఒక టీవీ ఛానల్లో వంటల ప్రోగ్రాంలో యాంకర్ కింద సెటిల్ అవ్వాల్సొస్తుంది జాగ్రత్త !" శపించా. వాడు పగలబడి నవ్వి లోపలికెళిపోయాడు, పొగిడాననుకున్నాడో ఏమో! అ