Skip to main content

యక్ష ప్రశ్నలు

ఈ టపా టైటిలు ఊరికే పెట్టలేదు. కాబట్టి ఒక చిన్న ప్రశ్న.

గాల్లోంచి సృష్టించే ప్రక్రియ నిర్వహించడానికి అతి ఉత్తమమైన కాంబినేషన్ ఏది ?

1. బాబాలు,విబూది
2. రాజకీయ నాయకులు,ఆత్మగౌరవం
3. సైంటిస్టులు,ఆక్సిజనుకి ప్రత్యామ్నాయం
4. నేను,థియరీ *
( * లేటుగా ఒచ్చినా లేటెస్టుగా ఒచ్చేదే...)

ముందే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది కాబట్టి మీరేమి సమాధానం చెప్పినా 4 కింద పరిగణించి తరువాతి పారాకు పాసు చేయడమయినది.

ప్రశ్నలు చాలా రకాలు. వాటిలో ముఖ్యమైనవి రెండు - సమాధానం చెప్పదగ్గవి, అడిగేవాళ్ళ ఉద్దేశం/స్వభావం తెలియకుండా సమాధానం చెప్పకూడనివి.

"ప్రమోషను కావాలా ?"
"నీకు లడ్డూ ఇష్టమా ?"
"సినిమాకి ఒస్తావా ?" ఇలాంటివి మొదటి రకం అన్నమాట.

ఇక రెండో రకానికి ఒద్దాం -

"ఖాళీగా ఉన్నావా ?"
"ఒక జోకు చెప్పమంటావా ?"
"తెలంగాణా ఒచ్చినట్టేనా ?"

ఇలాంటివి, అడిగే వాళ్ళ స్వభావం తెలియకుండా సమాధానం చెప్తే తరవాత జరిగే పరిణామాలకి మీరే బాధ్యులన్నమాట.

ఇంకో రకం ప్రశ్నలు ఉన్నాయి. ఇవి ఎన్ని సార్లు ఎదురయినా సమాధానం చెప్పకూడదు. అడిగేవాడు చొక్కా పట్టుకుని కొట్టేంత వరకూ వస్తే తప్ప మనం ఏమీ మాట్లాడకూడదు.

"ఒళ్ళు కొవ్వెక్కిందా ?"
"డబ్బులు ఎక్కువయ్యాయా ?"
"నువ్వు పెద్ద పోటు గాడివా ?"
"చాలా రకాలన్నావ్, అంటే మూడేనా ?"

ఇలాంటివి అన్నమాట. రక్తం కళ్ళ జూడ్డానికి సిద్ధం ఐతేనే ఇలాంటి వాటి జోలికి వెళ్ళాలి.

"అడిగేవాడు సోమసుందర్ ఐతే అన్ని రకాలు ఒక్కటే" అన్నది 'నా'నుడి. ఎందుకో తరవాత చెప్తాను.

ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఇద్దరు అందగత్తెలు మాకు ఙానం పంచడానికి ఒచ్చి ప్రశ్నల్లో రకాల గురించి వాళ్ళు నేర్చుకున్న థియరీ చెప్పారు.

ప్రశ్నలు రెండు రకాలుట -

Closed Ended Questions, Open Ended Questions.

Closed Ended Questions అంటే ఎదుటి వాళ్ళ చేతా "కట్టా" "కొట్టా" "తెచ్చా" "మెచ్చా" లాంటి జవాబులు చెప్పించేవి.

Open Ended Questions అంటే ఎందుకు, ఎట్లా, ఏ పరిస్థితుల్లో పైన చెప్పిన పనులు చెయ్యవలసి ఒచ్చిందో, వాటి గురించి మన ఆలోచనలేంటో చెప్పించేవిట.

ఎందుకో ఇదో బచ్చా థియరీ అనిపించింది నాకు.

లేకపోతే, మా బాసు ఎప్పుడూ రెండో రకం ప్రశ్న అడిగి మొదటి రకం సమధానం వస్తుందని ఎందుకు అనుకుంటాడు ప్రతిసారీ ? అతి జిడ్డు ప్రశ్నలకి అర ముక్క సమాధానం చెప్పాలిట, చరిత్ర ఒద్దుట !

అయినా ఇలాంటి థియరీలు వేటికీ చిక్కని కేసులు చూసాను నేను.

టీవీలో రామాయణం ఒస్తుండే రోజుల్లో మా బామ్మ పక్కన కూర్చుని చూసేవాణ్ణి.

"బామ్మా, దేవుడికి అన్ని చేతులు ఎందుకు ఉంటాయ్ ?"
"రాముడు సీతని ఎందుకు పంపించేసాడు ?"
"ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నాడు ?"

పిల్ల వెధవకి అర్ధం అయ్యేట్టు చెప్పడం తలకు మించిన పని అని గ్రహించి, మా బామ్మ టీవీలో ఉన్న రాముణ్ణి చూపించి వీలైనన్ని సార్లు నా చేత కళ్ళు మూయించి దణ్ణం పెట్టించేది. స్వతహాగా ఉన్న భక్తి చేత అలా నేను టీవీకి దణ్ణం పెడుతూ రామాయణం, మహా భారతం గడిచిపోయాయి.

అక్కడివరకూ బాగానే ఉంది.

చాలా యేళ్ళ తరవాత మా బంధువుల ఇంటికి వెళ్ళాను. వాళ్ళింట్లో ఒక పిడుగు ఉన్నాడు.

పంపులో నీళ్ళు ఒక గిన్నెలో పట్టుకుని నెత్తి మీద పోసేసుకుంటున్నాడు ఒక పావుగంట నించి.

వాణ్ణి ఇవతలకి లాక్కొచ్చాను. కింద పడిపోయి ఏడుస్తూ గొడవ చేస్తాడనుకున్నాను. చెయ్యలేదు.
అలా చేసున్నా బావుండేది, కాసేపు ఏడిచి, నన్ను గిచ్చో, కొట్టో మనశ్శాంతిగా(ఎల్లరకు) పడుకునేవాడు.

"రేయ్, అలా నీళ్ళలో తడవకూడదు, తప్పు" ముక్కు మీద వేలేసి చూపించాను.
"తడిస్తే ఏమవుతుంది ?" అడిగాడు వాడు.

వాడు అంత బుధ్ధిగా అడిగే సరికి చాలా సంతోషమేసింది. చిన్నప్పటి నా ప్రశ్నలు గుర్తొచ్చాయ్.
ఓపిగ్గా విడమరిచి చెప్దాం అనిపించింది.

"తడిస్తే నీళ్ళు తల్లోకి పోతాయి"
"అప్పుడూ ?"

వాడి ఙాన కాంక్ష చూస్తే ముచ్చటేసింది.

"అప్పుడేమో జలుబు చేస్తుంది, జరమొస్తుంది" అన్నాను.

"జరమొస్తే, అప్పుడూ ?"
"అప్పుడు అన్నం ఉండదు. డాక్టరు ఒచ్చి ఇంజీషనిస్తాడు "

"అప్పుడూ ?"
"అప్పుడు నొప్పేస్తుంది"

"అప్పుడూ ?"

అప్పుడు నాకు అర్ధం అయ్యింది వీడు సామాన్యుడు కాదని. ఇలా కాదు, మళ్ళి ఇంకోలా ప్రయత్నిస్తే ఏమయినా లాభం ఉండొచ్చు.

"నువ్వు ఇట్లా చెప్పిన మాట వినలేదు అనుకో, గడ్డం బూచాడు ఒస్తాడు"
"గడ్డం బూచాడా, ఏడీ ?" అడిగడు వాడు.

హమ్మయ్యా, కొంచెం మనశ్శాంతి. వీధి చివర చెత్త ఏరుకునే అతన్ని చూపించాను.

"బూచాడు ఒస్తే, అప్పుడు ?"
"వాడి దగ్గర సంచీ ఉంది చూసావా ?" అడిగాను.
అవునన్నట్టు తలాడించాడు.
"ఆ సంచీలో నిన్ను వేసుకుని తీసుకుపోతాడు"

వాడొక్క నిమిషం ఆలోచిస్తూ ఆగాడు.
"మా తమ్ముణ్ణి కూడా తీసుకుపోతాడా ?"

"మీ తమ్ముడు గొడవ చెయ్యట్లేదు కదా, కాబట్టి నిన్నొక్కణ్ణే తీసుకుపోతాడు" ఇంకోంచం భయపెట్టాను (అనుకున్నాను).
"మరి తాతని కూడా తీసుకుపోతాడా ?"
"ఉహూ, తాత అంటే వాడికి భయం. నిన్నొక్కణ్ణే తీసుకుపోతాడు.

వాడు ఇంకోసారి ఆగాడు, ఆలోచిస్తూ.
"గడ్డం బూచాడు తీసుకుపోతే, అప్పుడూ ?"

నాకు పూర్తిగా అర్ధం అయ్యింది. నాది వఠ్టి వృధా ప్రయాస అని.
టెక్నాలజీ ఇంత అభివృద్ది చెందింది అని తెలిస్తే అసలు ఈ దరిదాపులకే ఒచ్చేవాణ్ణి కాదు. ఏదో మాయోపాయం చేసి అక్కడి నించి బయిటపడ్డాను.

తరవాత కొన్నేళ్ళకి సోమసుందర్ పరిచయం అయ్యాడు, రూమ్మేటు. కొత్తల్లో బాగానే ఉండింది. లేదు, నాకలా అనిపించింది.
తరవాత తరవాత ఒక వేదనా, పరివేదనా మొదలయ్యాయి నాకు.

మనవాడు ఏమీ తోచకో ఏమో నన్ను చూసి అప్పుడప్పుడూ "ఊ" అనేవాడు.

అది పలకరింపో, సంబోధనో, ప్రశ్నో, మరోటో అర్ధం అయ్యేది కాదు. నేను పిలిస్తే పలికితే పర్లేదు.. పిలవకుండా అలా పలుకుతూంటే ఎంత బాధో, అనుభవిస్తేనే తెలుస్తుంది.

అలా "ఊ" అని వినపడగానే వేరే గదిలోకి వెళ్ళిపోవడం మొదలు పెట్టాను.
ఈసారి నన్ను వెదుక్కుంటూ ఒచ్చి పక్కన నించుని "ఊ" అనడం మొదలు పెట్టాడు.

ఓకసారి, నిలదీసి అడిగాను. "ఊ" అంటే ఏంటని.
"నువ్వు ఏమైన చెప్తావేమో విందామని అలా అంటూంటాను" అన్నాడు.
ఓహో, ఇది కూడా ఒక రకమైన కుశల ప్రశ్న అన్నమాట.

"మనమేమైనా రోజుల తరబడి వాదించుకుంటున్న విషయం నా వంతు దగ్గర ఆగిపోయిందా ? అలా కనిపించగానే 'ఊ' అంటే నేను మాత్రం ఏం చెప్పను ?" అరిచాననుకుంటా.

కొన్ని రోజులు నన్ను బాధించడం ఆపాడు. చూద్దును కదా, నన్ను కలవడానికి మా ఫ్రెండ్సు రావడం బాగా తగ్గిపోయింది. బైట ఎక్కడయినా కనిపించినా జాలిగా చూసేవాళ్ళు.

ఇంక లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాల్సిందే అనుకున్నాను.
ఒక అయిడియా అలా మెరిసింది.

ఈసారి నించి నేనే చొరవ తీసుకుని, వాడు 'ఊ' అంటాడేమో అనిపించినప్పుడల్లా గాఠ్టిగా వీపు మీద ఓటిచ్చి "ఏంట్రా సంగతులూ" అనేవాణ్ణి.

వాడు బాధతో "ఆఆఆఆ..." అనేవాడు.

మరుసటి రోజునించీ లోకం చాలా అందంగా కనిపించడం మొదలు పెట్టింది.

ఆహా, 'ఊ'కి 'ఆ'కీ ఎంత తేడా !

ఇహపోతే, ఏ రకమైన ప్రశ్న అయినా ఎదుర్కోడానికి మనం అర్జెంటుగా నేర్చుకోవాల్సింది ఒకటుంది.

మహభారత యుధ్ధ సమయంలో అర్జునుడు డీలాపడి ప్రశ్నలు అడిగేసిన తరవాత, భగవద్గీత చెప్పబోయే ముందూ, కృష్ణుడి మొహంలో ఉన్న ఎక్స్ప్రెషను. కొన్ని రోజులు అద్దం ముందు నించుని అది ప్రాక్టీసు చెయ్యాలి. ఆ తరువాత ఎవరయినా ఏదయినా ప్రశ్న అడగ్గానే, ఆ ఎక్స్ప్రెషను మొహంలోకి తెచ్చుకుని 'That depends' అని నాలుగు ముక్కలు మాట్లాడాలి. ఇక మనకి తిరుగులేదంతే !

Comments

మీరు చెప్పిన బుడుగు కంటే మా ఇంట్లోని చిన్న పిడుగు ఇంకా అన్యాయం. నా సమాధానం సగంలో వుండగానే అందులోనుండే మరో ప్రశ్న దాని నోట వస్తుంది!

తెలంగాణా ఓపెన్ ఎండెడ్ క్వెషన్ కదూ!
sunita said…
చాలా బాగా నవ్వించారు.

Popular posts from this blog

నేను, దేవుడు, మా నాన్న - 2

మర్నాడు ఆదివారం కావడంతో మా పిల్లకాయల పార్టీ సర్వ సభ్య సమవేశం మొదలైంది. పక్కింట్లో ఉండే బుజ్జి గాడూ, వాళ్ళ తమ్ముడు పండు గాడు, వాళ్ళ పక్కింట్లో ఉండే శీనుగాడూ, వాళ్ళ చెల్లి కవిత హాజరయ్యారు. అధ్యక్షత వహిస్తున్న మా చెల్లి డయిలాగులేవీ లేకుండా "ఓ పియా పియా.. ఓ పియా పియా " అంటూ ఇళయరాజా పాటని ప్రళయ రాగంలో విలయ తాండవం చేయించింది. అయిదు నిమిషాలయినా పాట ముందుకి కదలకపోవడంతో అందరూ వెళ్ళిపోక ముందే దాన్ని కూర్చోబెట్టి నేను మొదలెట్టాను. "జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట.. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ అనాథలైనా అభాగ్యులైనా అంతా నా వాళ్ళూ ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరూ" అంటూ వేలు చూపిస్తూ గుండ్రంగా తిరుగుతూ...ఆపేసాను - వీధి చివర చారిగాడు కనిపించాడు. మామూలుగా పరిగెట్టడం మానేసి గుర్రం ఎక్కి ఒస్తున్నట్టు గెంతుకుంటూ ఒస్తున్నాడు వాడు. ఒస్తూనే పక్కకి లాక్కెళ్ళి, "ఒరేయ్, మా నాన్న జేబులో యాభై రూపాయిలు దొరికాయి రా, మనం ఫైవ్ స్టార్ చాక్కెట్ట్లు కొనుక్కుందాం పద" అన్నాడు. అసలు వీడు గుండెలు తీసిన బంటు కాకపోయినా కనీసం గుండు చేసి ఒదిలిపెట్టే బంటు అని అప్పటికే నాకు అను

నేను, దేవుడు, మా నాన్న - 1

ఆ రోజు స్కూల్లో ఘోర పరాభవం జరిగింది.అసలు రోజూ స్కూల్ కి ఎందుకు వెళ్ళాలో అర్ధం గాక ఏడుస్తూ వెళ్తుంటే ఈ అవమానాలోటీ - బాలయ్య సినిమానే చూడలేక చూస్తుంటే, మధ్యలో విజయ్ కాంత్ డబ్బింగ్ సినిమా ట్రైలర్ వేసినట్టు ! సరే, అసలేం జరిగిందో చెబుతాను. ఆ రొజు పొద్దుటే స్కూల్లో ప్రెయెర్ జరుగుతోంది. రెండో క్లాసు వాళ్ళం కావడంతో తగిన గౌరవం ఇచ్చి ముందు నించోబెట్టారు. ఎదురుగా మా హెడ్మాష్టరు నించున్నాడు. వాడి పేరు వలవన్. పెద్ద పెద్ద మీసాలేసుకుని ఒక లోటాడు టీ తాగుతూ తిరిగే వాడంటే మాకు హడల్. మా టీచరుకి అంతకంటే హడల్ అని నా నమ్మకం. ఎందుకంటే క్లాసు రూము పక్క నించి వాడు వెళ్ళినప్పుడల్లా మా అందరికంటే ముందు మా టీచరు నోటి మీద వేలేసుకునేది. అది చూసి మేము కూడా వేసుకునేవాళ్ళం. అసలు వాడి లాంటి వాళ్ళని స్కూల్లో ఉంటే వలవన్ అంటారనీ, బైటకొచ్చి దేశం మీద పడితే వీరప్పన్ అంటారనీ తరవాత తరవాత, కొంచెం లోక ఙానం ఒచ్చాక తెలిసింది. ఇదివరకెపుడో కుదురు లేని దూడ పిల్ల పులి ముందుకెళ్ళి డాన్స్ చేసిందిట! నా వెనక నించున్న నాగబాబు గాడికి ఉన్నట్టుండి ఎక్కడలేని చిలిపితనం ముంచుకొచ్చి నిక్కర్లో నీట్ గా టక్ చేసి ఉన్న నా చొక్కాని సాంతం బైటకి లాగా

బోయినం

ఆ రోజు అప్రయత్నంగా వంట డ్యూటీ నాగబాబుకి ఇచ్చేసి డిక్షనరీ పక్కన పెట్టుకుని హిందూ పేపర్ చదువుకుంటున్నాను. "ఒరేయ్, పప్పులో ఉప్పెంత వెయ్యాలి ?" అడిగాడు నాగబాబు. "ఒక చారెడు వెయ్ " తల తిప్పకుండా సమధానం చెప్పా. "మరి చారేమో గిన్నెడు ఉంది కదరా ?" ఈ సారి తలెత్తి చూడకుండా ఉండలేకపోయాను. వంటింటి గుమ్మంలో బనీనుతో కుడి చేతిలో గరిట పట్టుకుని ఎడం చెయ్యి నడుం మీద వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్నాడు వాడు. "ఒరేయ్ బడుద్ధాయ్, నీకు తెలుగొచ్చా అసలు ?" అరిచాను. " ఓహో అర్ధం అయింది లే, అరుస్తావెందుకు ? చారిగాడు పెరుగు తెస్తానని బైటకి వెళ్ళాడు ఇప్పుడే. వాడొచ్చే దాకా ఆగాలంటే కష్టం" అన్నాడు నాగబాబు. ఈ రోజు హిందూ పేపరు అనవసరంగా కొన్నట్టున్నాను. "ఒరేయ్ సన్నాసీ, చారెడు అంటే ఇంత" అన్నాను అరచేతిలో నాలుగువేళ్ళ మీద బొటనవేలు మడిచి చూపిస్తూ, "అయినా నీకు తెలుగూ రాదు, వంటా రాదు; ఇలా ఐతే ఎదో ఒక టీవీ ఛానల్లో వంటల ప్రోగ్రాంలో యాంకర్ కింద సెటిల్ అవ్వాల్సొస్తుంది జాగ్రత్త !" శపించా. వాడు పగలబడి నవ్వి లోపలికెళిపోయాడు, పొగిడాననుకున్నాడో ఏమో! అ