Skip to main content

చారిగాడు

పెరుగు కోసం వెళ్ళిన చారిగాడు పెద్ద చప్పుడు చేస్తూ చెప్పులొదిలేసి తలుపు కూడా వెయ్యకుండా లోపలికొచ్చాడు. దాంతో నేను నా గతంలోంచి బైటికొచ్చాను. ఒచ్చిన వాడు కాస్తా చేతిలో కవరు పక్కన పారేసి కనీసం డప్పు మ్యూజిక్కైనా లేకుండా డాన్సెయ్యడం మొదలు పెట్టాడు. ఈ సందడి విని నాగబాబు పప్పుని దాని ఖర్మానికి ఒదిలేసి అక్కడికొచ్చి నించున్నాడు.

"ఏమయింది రోయ్" అడిగాను.
"ఒరేయ్, ఎదురింట్లో ఉంటుందే స్వాతి, ఆ పిల్ల నన్ను చూసి నవ్వింది రా. కాదు కాదు మూడు రోజుల నించి నవ్వుతోంది రా !" అన్నాడు వాడు.

"గట్టిగా నవ్విందా, చిన్నగా నవ్విందా ?"
"అదేం ప్రశ్నరా ? అందంగా, సినిమా హీరోయిన్లా నవ్వింది. ఇంక నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే" అంటూ డాన్స్ కంటిన్యూ చేశాడు వాడు.

అది వినగానే నాగబాబుగాడు నవ్వడం మొదలెట్టాడు.

వేస్తున్న డాన్స్ అలాగే ఆపేసి ఏవిటన్నట్టు వాడి వైపు చూసాడు చారిగాడు.

"ఒరేయ్, వీడికి చిన్నప్పుడే చెప్పాను, నిన్ను చూస్తే కుక్కలు కూడా నవ్వుతాయిరా అని, వినిపించుకోలేదు వీడు" నవ్వాపకుండా నా వైపు తిరిగి చెప్పాడు నాగబాబుగాడు.

చారిగాడు కోపంతో ఊగిపోడం మొదలెట్టాడు. ఇంకాసేపు ఊగడం కష్టమని నాగబాబుని కొట్టడానికి మీదకెళిపోయాడు.
నేను పరిగెత్తుకెళ్ళి జరగబోయే మహా సంగ్రామాన్ని ఆపాను.

"నేను ఇంత సీరియస్ విషయాన్నీ, ఇంత ఎమోషనల్ విషయాన్నీ చెప్తుంటే వాడు చూసావా ఏమన్నాడో ? వాడు చేసింది ముమ్మాటికీ తప్పు, ఈసారి కూడా వాణ్ణే సపోర్టు చేసావంటే నీ సంగతి చూస్తాను" మళ్ళీ ఊగిపోతూ అన్నాడు చారిగాడు.

"నా సంగతి తర్వాత చూడొచ్చు, ముందు ఆటు వైపు చూడోసారి" అన్నాను వీధి వైపు చూపిస్తూ.
ఎదురింటమ్మాయి బాల్కనీలో పడీ పడీ నవ్వుతోంది.

చారిగాడు అయోమయంగా నా వైపు చూసాడు.
"నీకో చేదు నిజం చెప్పాలి" గొంతు సవరించుకొంటూ అన్నాను.

"ఆ అమ్మాయి ముందు నిన్ను చూసి నవ్విందా, నువ్వు లోపలికి రాగానే మన పక్కింట్లో ఉంటుందే పంజాబీ పిల్ల, తనని సైగ చేసి పిలుస్తుంది. ఆ అమ్మాయి బాల్కనీ లోంచీ, ఈ అమ్మాయి కిటికీ లోంచి నువ్వు చేసే విన్యాసాలు చూసి ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ సాయంత్రం వీధి చివర చాట్ బండీ దగ్గర కలుసుకుని ఒక గంట సేపు నవ్వుకుంటారు. మొన్న అక్కడే ఉండి దొంగచాటుగా మేం వింటే ఈ సంగతులన్నీ తెలిసాయి" అంటూ నేను ఇంకా ఏదో చెప్పబోతుండగా, నాగబాబుగాడు అందుకున్నాడు.

"ఇవాళంటే నీకు బాగా అలవాటున్న తీన్ మార్ స్టెప్పులేసావ్ గానీ, నిన్నా మొన్నా బ్రేక్ డాన్స్ వేసినప్పుడు పండగ చేస్కున్నారంటలే ! మేం బయిటకెళ్ళి మిస్సయిపోయాం." అని మళ్ళీ నవ్వడం మొదలెట్టాడు. ఈసారి నేను కూడా నవ్వకుండా ఉండలేకపోయాను.

మళ్ళీ వాడే, "ఇంకో రెండ్రోలు పోతే, వాళ్ళ బాబూ వీళ్ళ బాబూ ఒచ్చి టీవీకయ్యే కరెంటు ఖర్చు కలిసొస్తుందనీ,రోజూ వాళ్ళిళ్ళకొచ్చి డాన్సు చెయ్యమనీ అడిగే ప్లాన్లో ఉన్నారు" అంటూ ఇంకా ఏదో అనబోతూంటే వాడి నోరు నొక్కేసి పప్పు మాడిపోతోందని చెప్పి అవతలకి తోసేసాను.

షాక్ లోంచి అప్పుడప్పుడే తేరుకుంటున్న చారిగాడు "పోనీలేరా, మీరు నవ్వితే నాకేం బాధలేదు. లోకం ఇంత గుండె లేనిదని ఇప్పుడే తెలిసింది. నా కళ్ళు తెరిపించినందుకు థాంక్స్ రా, మీరే రా నిజమైన ఫ్రెండ్స్ అంటే" అని కళ్ళలో సుడులు తిరుగుతున్న నీళ్ళతో, బాధగా బయిటకెళిపోయాడు.

చిన్నప్పట్నించీ చూడబట్టి మాకు అలవాటైపోయింది గానీ, వేరే వాళ్ళెవరైనా చూస్తే - సెంటిమెంటులో వేంకటేష్, ఆవేశంలో బాలయ్య, డాన్సులో సూపర్ స్టారు, ఊహల్లో రాఘవేంద్రరావూ...వీళ్ళందరినీ మరిపిస్తాడు వీడు !
ఇప్పుడు వాణ్ణి కదిపితే Atomic explosion అవుతుందేమో అని భయపడి ఆగిపోయాను.

వాడు బయిటకెళ్ళిపోగానే, నేను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి ఎంటరయ్యాను.

-------------------------------------------------------------------

Comments

Anonymous said…
మీ నాగబాబు నేను ఆరు ఏళ్ళ నాలుగు నెలల 21 రోజుల క్రితం మా "చోటూ"గాడినన్న మాటలని పొల్లుపోకుండా అన్నాడండీ వేంఅన గారు. సంతోషం. నాగబాబుకి అభినందనలు. ఏం మాటలా ? ఇవీ - " "ఒరేయ్, వీడికి చిన్నప్పుడే చెప్పాను, నిన్ను చూస్తే కుక్కలు కూడా నవ్వుతాయిరా అని, వినిపించుకోలేదు వీడు"

సందర్భం వేరు అనుకోండి. అయినా ఒక్కసారి అలా చోటుగాడు నా కళ్ళ ముందు మెఱిసాడు . :) :)
Unknown said…
ఈ టపా ఇంట్రో (1st para) మటుకు అదిరింది. చదవగానే చప్పున నీళ్ళొచ్చినాయి. :) ఎందుకా ? అందుకు. కొన్ని ఖంగు ఖంగున మోగాయి - కంచు మోగినట్టు. మా గ్రూపులో సుజిత్(చారి మాష్టారు), రమణ (నాగబాబు మాష్టారు) గుర్తుకొచ్చారు. అభినందనలు

జవిక్ శాస్త్రి
మళ్ళీ నవ్వుతున్నాను. ;) [నెప్పి కూడా మరిచి, థాంక్స్]

ఇట్లు,
స్వాతి.
ee naagababu lo naaku paramesh kanabadutunnadu ;)
వేమన said…
ఆఙాత - మీరు కూడా మా వాడి లాగా ఛాన్స్ దొరికితే ఎవరినీ ఒదిలిపెట్టరన్నమాట :)

ఉషగారూ - నెనర్లు. అన్నట్టు వేలు జాగ్రత్త !
శాస్త్రిగారూ - ధన్యవాదాలు !

islandofthoughts - అంతా బాగేనా ? చారిగాడిలో ఎవరూ కనబడలేదా :)
Manohar Dubbaka said…
Comedy bagundi hero..tell me one thing...idanta imagination ee????
భావన said…
మీ చారి, నాగ బాబు కు థ్యాంక్స్ అండీ, మరీ మొహమాట పెట్టి నవ్విచ్చేస్తున్నారు..
ఫస్ట్ ఫోస్ట్ లో మొదలు పెట్టిన నవ్వు ఇప్పటివరకు ఆగలేదు సార్ . మీ ఫ్రెండ్సే మీ asset
వేమన said…
భావనగారు, శివరంజనిగారు - నెనర్లు!
అయితే నమ్మేసారన్నమాట. నా సంగతి ప్రక్కనుంచి ఇక్కడ పుట్టి పెరుగుతున్న నా సంతు కూడ అచ్చమైన ఆంధ్రావారి గోదావరి వంటకాలే తింటారు విన్నారా వేమన?

మచ్చుక్కి
ముద్దపప్పు + అల్లం పచ్చడి + ఇంట్లో కాచిన నెయ్యి;
మాగాయ పచ్చడి + నేను తోడు పెట్టిన పెరుగన్నం;
మామిడికాయ పప్పు + పిండి వడియాలు;
పులిహోర, గారెలు;
సాంబార్ ఇడ్లి, దోశ కొబ్బరి పచ్చడి.

ఇవన్నీ రోజూ వారీవి. పండుగలకి నా లిస్ట్ చెప్తే అమ్మో వద్దులే నాకు దిష్టి పెడతారు మీరు ;)
బూంది లడ్డు, కాజాలు, చక్కిడాలు తో సుతా అన్నీను. [ఇది లాస్ట్ శుక్రవారం అనుకున్న వ్యాఖ్య, వేలు సహకరించక ఇలా ఆలస్యంగా..]
వేమన said…
ఉషగారూ,
ఆహా... ఏం చెప్పారండీ... చదువుతుంటేనే నోరూరిపోతోంది :)

Popular posts from this blog

నేను, దేవుడు, మా నాన్న - 2

మర్నాడు ఆదివారం కావడంతో మా పిల్లకాయల పార్టీ సర్వ సభ్య సమవేశం మొదలైంది. పక్కింట్లో ఉండే బుజ్జి గాడూ, వాళ్ళ తమ్ముడు పండు గాడు, వాళ్ళ పక్కింట్లో ఉండే శీనుగాడూ, వాళ్ళ చెల్లి కవిత హాజరయ్యారు. అధ్యక్షత వహిస్తున్న మా చెల్లి డయిలాగులేవీ లేకుండా "ఓ పియా పియా.. ఓ పియా పియా " అంటూ ఇళయరాజా పాటని ప్రళయ రాగంలో విలయ తాండవం చేయించింది. అయిదు నిమిషాలయినా పాట ముందుకి కదలకపోవడంతో అందరూ వెళ్ళిపోక ముందే దాన్ని కూర్చోబెట్టి నేను మొదలెట్టాను. "జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట.. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ అనాథలైనా అభాగ్యులైనా అంతా నా వాళ్ళూ ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరూ" అంటూ వేలు చూపిస్తూ గుండ్రంగా తిరుగుతూ...ఆపేసాను - వీధి చివర చారిగాడు కనిపించాడు. మామూలుగా పరిగెట్టడం మానేసి గుర్రం ఎక్కి ఒస్తున్నట్టు గెంతుకుంటూ ఒస్తున్నాడు వాడు. ఒస్తూనే పక్కకి లాక్కెళ్ళి, "ఒరేయ్, మా నాన్న జేబులో యాభై రూపాయిలు దొరికాయి రా, మనం ఫైవ్ స్టార్ చాక్కెట్ట్లు కొనుక్కుందాం పద" అన్నాడు. అసలు వీడు గుండెలు తీసిన బంటు కాకపోయినా కనీసం గుండు చేసి ఒదిలిపెట్టే బంటు అని అప్పటికే నాకు అను...

అదిగో పులి - 1

ఆ రోజు పొద్దుటే చిన్న తలనెప్పితో నిద్ర లేచాను. ఆఫీసు గుర్తు రాగానే పరిస్థితి చెయ్యి దాటి పోయింది. ఛీ, ఇంతేనా జీవితం అనిపించింది. పోనీ ఎగ్గొట్టేద్దామా, మా బాసుగాడి ఫ్రెంచి గడ్డం సాక్షిగా క్రితం రోజు మీటింగు రూములో ఎక్సెల్ షీట్లు మార్చుకుని చేసుకున్న బాసలు గుర్తొచ్చాయి. చేసుకున్నవాడికి చేసుకున్నంత అని ఇందుకే అన్నారు కాబోలు. నేను గానీ కనిపించకపోతే ఆ విరహ వేదనలో వాడో సైకో కిల్లర్ అయ్యి మా ఇల్లు వెతుక్కుంటూ ఒస్తాడేమో అని భయమేసి తయారవడం మొదలెట్టాను. ఇంకేమైనా మార్గాలు దొరుకుతాయేమో అని అలొచించినా ఏమీ తట్టకపోవడంతో సౌరవ్ గంగూలీ బాటింగుకి బయలుదేరినట్టు ఆఫీసుకి బయలుదేరాను. బస్సెక్కి కూచోగానే ఇంటికి ఫోన్ చేసాను. మా అమ్మ ఎత్తింది. బావున్నావా, బాగా తింటున్నావా, రోజు స్నానం చేస్తున్నావా, పప్పులో పోపెయ్యడం ఇప్పటికయినా ఒచ్చిందా లాంటి కబుర్లన్నీ అయిపోయాక, "అమ్మా, ఏంటో బొత్తిగా ఇంటరెస్టు ఉండట్లేదే దేని మీదా, అసలు మనసు మనసులో లేదు" అన్నాను. "తొందరగా పెళ్ళి చేసుకోరా, లేకపోతే ఆ అమ్మాయెవరో చెప్పు , మీ నాన్నా నేనూ వెళ్ళి వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడతాం". "నాకే టయిములేక ఏడుస్తుంట...

నేను, దేవుడు, మా నాన్న - 1

ఆ రోజు స్కూల్లో ఘోర పరాభవం జరిగింది.అసలు రోజూ స్కూల్ కి ఎందుకు వెళ్ళాలో అర్ధం గాక ఏడుస్తూ వెళ్తుంటే ఈ అవమానాలోటీ - బాలయ్య సినిమానే చూడలేక చూస్తుంటే, మధ్యలో విజయ్ కాంత్ డబ్బింగ్ సినిమా ట్రైలర్ వేసినట్టు ! సరే, అసలేం జరిగిందో చెబుతాను. ఆ రొజు పొద్దుటే స్కూల్లో ప్రెయెర్ జరుగుతోంది. రెండో క్లాసు వాళ్ళం కావడంతో తగిన గౌరవం ఇచ్చి ముందు నించోబెట్టారు. ఎదురుగా మా హెడ్మాష్టరు నించున్నాడు. వాడి పేరు వలవన్. పెద్ద పెద్ద మీసాలేసుకుని ఒక లోటాడు టీ తాగుతూ తిరిగే వాడంటే మాకు హడల్. మా టీచరుకి అంతకంటే హడల్ అని నా నమ్మకం. ఎందుకంటే క్లాసు రూము పక్క నించి వాడు వెళ్ళినప్పుడల్లా మా అందరికంటే ముందు మా టీచరు నోటి మీద వేలేసుకునేది. అది చూసి మేము కూడా వేసుకునేవాళ్ళం. అసలు వాడి లాంటి వాళ్ళని స్కూల్లో ఉంటే వలవన్ అంటారనీ, బైటకొచ్చి దేశం మీద పడితే వీరప్పన్ అంటారనీ తరవాత తరవాత, కొంచెం లోక ఙానం ఒచ్చాక తెలిసింది. ఇదివరకెపుడో కుదురు లేని దూడ పిల్ల పులి ముందుకెళ్ళి డాన్స్ చేసిందిట! నా వెనక నించున్న నాగబాబు గాడికి ఉన్నట్టుండి ఎక్కడలేని చిలిపితనం ముంచుకొచ్చి నిక్కర్లో నీట్ గా టక్ చేసి ఉన్న నా చొక్కాని సాంతం బైటకి లాగా...